మత్స్యకారులకు ముగిసిన శిక్షణ
కూసుమంచి: పాలేరులోని పీవీ నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో పది జిల్లాల మత్స్యకారులకు ఇస్తున్న మూడు రోజుల శిక్షణ శనివారం ముగిసింది. ‘జలాశయాల్లో మత్స్య అభివృద్ధి – యాజమాన్య పద్ధతులు’ అనే అంశంపై ఇచ్చిన శిక్షణకు ఖమ్మం, నిజామాబాద్, హనుమకొండ, సూర్యాపేట, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల మత్స్యకారులు పాల్గొన్నారు. కాగా, ముగింపు సమావేశంలో సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి బి.నాగులునాయక్ మాట్లాడుతూ.. శిక్షణను మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని మత్స్య అభివృద్ధి సాధించాలని, తద్వారా రాష్ట్రాన్ని ఆక్వా హబ్‌గా మార్చాలని సూచించారు. చేపల పెంపకంతో పాటు మార్కెటింగ్ కూడా కీలకమైనందున మెళకువలు నేర్చుకోవాలని పేర్కొన్నారు. మత్స్యపరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్‌తో పాటు శాస్త్రవేత్తలు శాంతన్న, రవీందర్, నాగరాజు మాట్లాడగా శిక్షణలో పాల్గొన్న వారికి నైపుణ్య సర్టిఫికెట్లు అందజేశారు.
కాంటాల జాప్యంపై
రైతు ఆగ్రహం
నేలకొండపల్లి: ధాన్యం కాంటాల్లో జాప్యం జరుగుతుండడంతో ఓ రైతు రోడ్డుపై ధాన్యం పోసి నిప్పంటించేందుకు యత్నించాడు. మండల కేంద్రంలోని మార్కెట్‌లో ఏర్పాటు చేసిన డీసీఎంఎస్ కేంద్రానికి 50 రోజుల కిందట తాతా హనుమంతరావు ధాన్యం తీసుకొచ్చాడు. ఇప్పటివరకు కాంటా వేయకపోగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుండడంతో శనివారం ఆయన బోదులబండ – నేలకొండపల్లి రహదారిపై ధాన్యం బస్తాలను వేసి నిప్పంటించేందుకు యత్నించాడు. దీంతో సహచర రైతులు అడ్డుకోగా, తహసీల్దార్ వెంకటేశ్వర్లు చేరుకుని నచ్చజెప్పారు. త్వరగా కాంటా వేయిస్తామని నిర్వాహకులు చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.
హోరాహోరీగా
నెట్‌బాల్ పోటీలు
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి 8వ సబ్ జూనియర్ అండర్–16 నెట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి 620 మంది బాలబాలికలు పోటీలకు హాజరయ్యారు. ట్రెడిషనల్, ఫాస్ట్–5, మిక్స్‌డ్ కేటగీరీల్లో క్రీడాకారులు తలపడుతున్నారు. ట్రెడిషనల్, ఫాస్ట్–5 కేటగిరీలకు సంబంధించి బాలుర, బాలికల పోటీలు శనివారం ముగియగా, మిక్స్‌డ్ డబుల్ నెట్‌బాల్ పోటీలు శనివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. కాగా, ట్రెడిషనల్, ఫాస్ట్–5 కేటగిరీల బాలుర, బాలికల విభాగంలో నారాయణపేట, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. ట్రెడిషనల్ కేటగిరీలో నారాయణపేట, కరీంనగర్ మొదటి రెండు స్థానాల్లో నిలవగా హైదరాబాద్, ఖమ్మం సంయుక్తంగా మూడో స్థానం దక్కించుకున్నాయి. ఇక బాలికల విభాగంలో మేడ్చల్, నల్లగొండ మొదటి రెండు స్థానాలు చేజిక్కించుకోగా, మూడో స్థానాన్ని జనగామ, ఖమ్మం పంచుకున్నాయి. ఫాస్ట్–5 కేటగిరీ బాలుర విభాగంలో నారాయణపేట, ఖమ్మం జట్లు మొదటి రెండు స్థానాలు సాధించాయి. అలాగే, మహబూబ్‌నగర్, కుమురం భీం ఆసిఫాబాద్ మూడో స్థానం సంయుక్తంగా దక్కించుకున్నాయి. ఇక బాలికల విభాగంలో మేడ్చల్, ఖమ్మం జట్లు విజేతగా నిలవగా జనగామ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల జట్లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. కాగా, మిక్స్‌డ్ డబుల్స్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగియనున్నాయి.
చోరీ కేసులో నిందితుడి ఆత్మహత్యాయత్నం
తిరుమలాయపాలెం: చోరీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బంగారు ఆభరణాలు అప్పగించే విషయమై పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఎర్రగడ్డ గ్రామానికి చెందిన నల్లమల్ల ప్రతాప్ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు బంగారు నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. ఈ క్రమాన విచారణ చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన సందీప్‌ను అదుపులోకి తీసుకోగా చెవిదిద్దులు తిరిగి ఇచ్చి, నెక్లెస్ మరో వ్యక్తి వద్ద ఉందని చెప్పాడు. పోలీసులు శనివారం సందీప్‌తో పాటు ఇంకో వ్యక్తిని విచారించి ఆభరణాలు ఇచ్చేయాలని సూచించి పంపించారు. దీంతో సందీప్ ఇంటికి వెళ్లాక, అక్కడి నుంచి తిరుమలాయపాలెం సొసైటీ గోదాం వెనకాలకు చేరుకుని పురుగులమందు తాగాడు. విషయం కుటుంబీకులకు తెలియడంతో ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా, సందీప్‌పై గతంలో పోక్సో కేసు కూడా ఉందని తెలిసింది.
మత్స్యకారులకు ముగిసిన శిక్షణ


