ముగ్గురు కుమార్తెలు జన్మించారని ఆత్మహత్య
ఖమ్మంరూరల్: వరుసగా ముగ్గురు కుమార్తెలు జన్మించడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. రూరల్ మండలం వెంకటగిరికి చెందిన దగ్గుపాటి గోపి (26)కి ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. ఇప్పటికే వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, ఈ నెల 14న మరో ఆడపిల్ల జన్మించింది. అయితే, కుమారుడు లేడనే మనస్తాపంతో మద్యం తాగొచ్చిన ఆయన గురువారం ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. కాసేపటికి కుటుంబ సభ్యులు కిందకు దించే సరికి మృతి చెందాడు. గోపి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
కుటుంబ కలహాలతో వృద్ధుడు..
తిరుమలాయపాలెం: కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన వృద్ధుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని ఏలువారిగూడెంనకు చెందిన కన్నెబోయిన లింగయ్య (74) దంపతులు 15 రోజుల కిందట గొడవ పడ్డారు. దీంతో భార్య తల్లి గారింటికి వెళ్లగా ఆయన మనుమరాలి ఇంటి వద్ద భోజనం చేస్తున్నాడు. బుధవారం మనుమరాలి ఇంటికి వెళ్లిన లింగయ్య పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా, ఆయనను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందగా కుటుంబీకుల ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలపారు.
ఆర్టీసీ బస్సులో ఘర్షణ
అశ్వాపురం: ఆర్టీసీ మణుగూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సులో ఇద్దరు మహిళలు ఘర్షణ పడిన పంచాయతీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సులో ఇద్దరు మహిళలకు సీటు విషయంలో గొడవ జరిగింది. ఒకరు ఆపిన సీటులో మరొకరు కూర్చోవటంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొని ఘర్షణకు దారితీసింది. తోటి ప్రయాణికులు వారించిన గొడవ సద్దుమణగకపోవడంతో బస్సును అశ్వాపురం పోలీస్‌స్టేషన్ వద్ద ఆపి, విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సీఐ అశోక్‌రెడ్డి ఇద్దరు మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి, వేర్వేరు బస్సుల్లో పంపించేశారు.


