
ప్రశ్నార్థకంగా రాష్ట్ర మనుగడ
● నాడు కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలకుల దోపిడీ ● అందుకే తెలంగాణ ప్రజల చూపు బీజేపీ వైపు... ● మేధావులు, పట్టభద్రుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం మామిళ్లగూడెం: గత, ప్రస్తత పాలకుల తీరుతో తెలంగాణ రాష్ట్ర మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఖమ్మం వచ్చిన ఆయన విద్యాసంస్థల అధినేతలు, వైద్యులు, న్యాయవాదులు, లెక్చర్లలతో పాటు పట్టభద్రులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల పాలనలో కేసీఆర్, గత ఆరు నెలల పాలనలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోపిడీ చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన విషయాన్ని గుర్తించిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. ఈవిషయమై మేధావులు, విద్యావంతులు కూడా ఆలోచించి నల్ల గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. అధికారం కోసం కాకుండా దేశం, ధర్మం కోసం పనిచేయకపోతే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని తెలిపారు.
పతనమవుతున్న విలువలు
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కై వసం చేసుకోనుందని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరుగుతుందని తెలిపారు. కాగా, రాష్ట్ర రాజకీయాల్లో నైతిక విలువలు పతనమవుతున్నాయని.. గెలి చాక ఏ పార్టీలోకి వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ అధికారం కోసం నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ తదితర హామీలు ఇవ్వగా ఏదీ నెరవేర్చలేదని విమర్శించారు. ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగెత్తిపోగా.. రేవంత్‌రెడ్డి మా త్రం పదేళ్లుగా తానే సీఎంనని చెప్పుకుంటున్నారన్నా రు. ఏదిఏమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచి అధికారం చేపడుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల యజమానులు బిల్లులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు రఘునందనరావు, మార్తినేని ధర్మారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, తాండ్ర వినోద్‌రావు పాల్గొన్నారు.