
ట్యాంకర్‌ను క్రేన్ సాయంతో నిలబెడుతున్న దృశ్యం
● జాతీయ రహదారిపై వరదలా పారిన డీజిల్ ● ఏసీపీ రఘు ఆధ్వర్యాన ఐదు గంటల పాటు రెస్క్యూ
సత్తుపల్లిటౌన్: హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన సత్తుపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. సుమారు రూ.38 లక్షల విలువైన 26వేల లీటర్ల డీజిల్‌తో ట్యాంకర్ వస్తుండగా, డ్రైవర్ అతివేగంగా వెళ్తూ సత్తుపల్లి పోస్టాఫీస్ సెంటర్ వద్ద బ్రేక్ వేయగానే అదుపు తప్పి పడిపోయింది. బస్టాండ్ ఇన్‌గేట్ ఎదుట ఈ ఘటన జరగగా మధ్యాహ్నం ఎండ కారణంగా జనసంచారం లేకపోవడంతో ప్రాణహానీ తప్పింది. అయితే ట్యాంకర్ పడిన సమయాన పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. డ్రైవర్ అజయ్‌పాల్ గాయాలతో బయట పడటంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన సత్తుపల్లిలో తీవ్ర ఆందోళన కలిగించింది.
ఐదు గంటలు సాగిన రెస్క్యూ
ట్యాంకర్ జాతీయ రహదారికి అడ్డంగా పడిపోయి అందులో నుంచి డీజిల్ రహదారిపై వరదలా పారటంతో అటుగా వెళ్లే వాహనదారులు జారి కింద పడ్డారు. దీంతో ఏసీపీ ఎ.రఘు, సీఐ టి.కిరణ్ సిబ్బందితో చేరుకొని ట్రాఫిక్‌ను మళ్లించడంతో పాటు ముందస్తుగా ఆ ప్రాంతంలోని దుకాణాలను మూసివేయించారు. అలాగే, అశ్వారావుపేట నుంచి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది డీజిల్‌పై ఫోమ్ స్ప్రే చేస్తుండగా, సింగరేణి నుంచి తెప్పించిన భారీ క్రేయిన్‌తో డీజిల్ ట్యాంకర్‌ను సరిచేశారు. ఆ సమయంలో మరోమారు పెద్ద శబ్దం రావడంతో అంతా ఉలిక్కి పడ్డారు. ఇక డీజిల్ పారిన రహదారిపై మున్సిపల్ సిబ్బందితో బ్లీచింగ్, ఇసుక ఊక చల్లించి పరిస్థితులు చక్కదిద్దారు. సుమారు ఐదు గంటల పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి ఉద్యోగులు, బెటాలియన్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఎర్రని ఎండలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.