
చెట్లు నరికిన ప్రాంతంలో విచారణ చేస్తున్న ఎఫ్‌డీఓ బాబు, అధికారులు (ఫైల్)
కామేపల్లి: కంచె చేను మేసిన చందంగా అడవులను కాపాడాల్సిన అధికారులే అక్రమంగా చెట్లను నరికివేయిస్తున్నారా... పోడు సాగు కోసం అటవీ ప్రాంతంలో చెట్లను నరుకుతున్న వారికి అండగా నిలుస్తున్నారా... ఇందుకు ప్రతిఫలంగా భారీ మొత్తంలో ముడుపులు స్వీకరిస్తున్నారా... దావత్ చేసుకునేందుకు గొత్తికోయల నుంచి జీవాలను సైతం తీసుకున్నారా... ఈ ప్రశ్నలన్నింటికీ తాజా పరిణామాలతో అవుననే సమాధానం వస్తోంది. కామేపల్లి మండలంలోని మద్దులపల్లి ఊటవాగు ప్రాంతంలో అటవీ అధికారులు ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో చెట్లను నరుకుతున్నట్లు తేలగా... బీట్ పరిధిలోని అధికారులను ఆరా తీయగా నివేదిక సమర్పించారు. అయితే, నివేదిక తప్పుల తడకగా ఉందని, చెట్ల నరికి వారికి కొందరు సహకరించారనే ప్రచారం జరిగింది. ఈమేరకు అటవీ శాఖ స్క్వాడ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు మళ్లీ పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. సుమారు రెండు ఎకరాల్లో చెట్లను నరికేశారని, ఇందుకు అటవీ ఉద్యోగులు సహకరించడంతో తేలడంలో విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కాక తప్పుదోవ పట్టించిన ఓ బీట్ ఆఫీసర్‌పై జిల్లా అధికారి సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే, మరో ఇద్దరిపై విచారణ కొనసాగుతుండగా, ఎవరి పాత్ర ఎంత వరకు ఉందో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
అడవిలోనే గొత్తికోయల నివాసం..
మద్దులపల్లి పరిధిలోని ఊగవాగు ప్రాంతంలో 2013లో ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన సుమారు 16 కుటుంబాలు నివాసముంటున్యాయి. అడవిలోనే ఉంటున్న వీరు సుమారు 15 హెక్టార్లలో చెట్లను నరికి పోడు సాగు చేసుకున్నారు. అప్పట్లోనూ వీరికి అటవీ శాఖ అధికారుల సహకారం ఉండడంతోనే అడ్డుకునే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వచ్చాయి. ఆతర్వాత రాష్ట్రప్రభుత్వం పోడుసాగుపై కఠినంగా వ్యవహరిస్తూనే హరితహారంలో భాగంగా మొక్కలు నాటించింది. దీంతో కొన్నాళ్లు అధికారులు కొద్దిగా కట్టడి చేసి గోత్తికోయలు సాగు చేసిన భూమిలో సుమారు పది హెక్టార్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక గోత్తికోయలను గుట్ట పైనుంచి కిందకు దించాలనే ప్రయత్నించినా వారు ఒప్పుకోకపోవడంతో మళ్లీ ఒత్తిడి తీసుకురాకపోతే మౌలిక వసతులు సైతం కల్పించి ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు.
కొనసాగుతున్న విచారణ
ఇటీవల ప్రభుత్వం పోడుసాగుదారులు పలువురికి పట్టాలు ఇచ్చింది. ఇంతలోనే మద్దులపల్లి ఊటవాగు ప్రాంతంలో మళ్లీ సాగు కోసం చెట్ల నరికివేత మొదలైంది. దీని వెనుక ఓ పార్టీ నాయకుడు ఉండగా.. ఉద్యోగులకు ముడుపులు అప్పగించడమే కాక గొత్తికోయల నుంచి జీవాలు ఇప్పించినట్లు సమాచారం. ఈవిషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఉన్నతాధికారుల సూచనతో అటవీ భూమిలో చెట్లునరికిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అంతేకాక ఉద్యోగుల విచారణ చేపట్టి మద్దులపల్లి(తూర్పు) బీట్ ఆఫీసర్ విజయ్‌ను సస్పెండ్ చేశారు.కిక ఊట్కూర్(ఉత్తరం), మద్దులపల్లి(పడమర) బీట్ ఆఫీసర్లపై విచారణ కొనసాగుతుండగా, గొత్తికోయలను ఎవరు ప్రోత్సహించారు, ఉద్యోగుల పాత్ర ఏమిటనే అంశాలు తేలాక మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం.
అడవిని నరికే వారికి అటవీ ఉద్యోగుల సహకారం
పలువురు ఉద్యోగులపై కొనసాగుతున్న విచారణ
పక్కా ప్లాన్ ప్రకారమే చెట్లు నరికివేసినట్లు అనుమానాలు

పోడు సాగు కోసం చదును చేసిన అటవీ భూమి