మరి.. మా పరిస్థితి ఏమిటి?

- - Sakshi

ఆందోళనలో గెస్ట్‌ లెక్చరర్లు

కొత్త వారిని నియమించాలని ప్రభుత్వ ఆదేశం

జిల్లాలో 42మందిని తీసుకునేందుకు ఆమోదం

ఖమ్మంసహకారనగర్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో రెగ్యులర్‌ అధ్యాపకులతో సమానంగా కీలకమైన సబ్జెక్టులు బోధించే గెస్ట్‌ లెక్చరర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కష్టపడి చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం రాకున్నా నిరాశ చెందకుండా గెస్ట్‌ లెక్చరర్లుగా ఏళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇప్పుడు వీరిని కొనసాగించకుండా, రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యాన మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక చేయాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇన్నాళ్లుగా పనిచేస్తున్న వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

జిల్లాలో 61మంది

జిల్లాలో 19 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సుమారు 7వేల మంది చదువుకుంటున్నారు. ఇక వివిధ సబ్జెక్టులను 61మంది గెస్ట్‌ లెక్చరర్లు బోధిస్తుండగా, నెలకు రూ.28,060 వేతనం అందుతోంది. ఏటా విద్యాసంవత్సరం ఆరంభంలోనే వీరిని రెన్యూవల్‌ చేస్తారు. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు విధుల్లోకి తీసుకోకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవిస్తున్నారు. ఇంతలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయటంతో గెస్ట్‌ లెక్చరర్లలో ఆందోళన మొదలైంది. కాగా, జిల్లాలో 42మంది నియామకానికే అనుమతించడం.. ప్రస్తుతం 61మంది విధులు నిర్వర్తిస్తున్న నేపథ్యాన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.

పీజీ మార్కులే ప్రామాణికం

2023–24వ విద్యాసంవత్సరానికి గెస్ట్‌ లెక్చరర్లను తీసుకునేందుకు ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా పీజీ కోర్సులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలని సూచించారు. కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరించే ఎంపిక కమిటీలో అదనపు కలెక్టర్‌(రెవెన్యూ), సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ సభ్యులుగా ఉంటటారు. ఈ ఉత్తర్వులతో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమ పరిస్థితి ఏమిటని గెస్ట్‌ లెక్చరర్లు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈనెల 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి 26న పరిశీలన అనంతరం 27వ తేదీన సబ్జెక్టుల వారిగా మెరిటీ జాబితా ప్రకటిస్తారు. అనంతరం 28వ తేదీన కలెక్టర్‌ ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేయనుండగా, ఆగస్టు 1వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంటుంది.

42మందికి అనుమతి

జిల్లాలోని వివిధ కళాశాలల్లో 42మంది గెస్ట్‌ లెక్చరర్ల నియామకానికి ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్‌ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్‌(రెవెన్యూ), కళాశాల ప్రిన్సిపాల్‌ సభ్యులుగా ఉండే కమిటీ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఖాళీల వివరాల ఆధారంగా గెస్ట్‌ లెక్చరర్ల నియామకం చేపడుతారు.

– రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top