పండుగ సంబరాల్లో విషాదం | - | Sakshi
Sakshi News home page

పండుగ సంబరాల్లో విషాదం

Nov 10 2026 12:07 AM | Updated on Nov 10 2026 12:07 AM

రాయచూరు రూరల్‌: దీపావళి పండుగ ముగించుకుని సొంతూరుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తూ కారు బోల్తా పడటంతో భార్యాభర్తలు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వివరాలు ఇలా.. సింధనూరు నివాసితులైన రాఘవేంద్ర (30), హేమలత (27) ప్రేమ వివాహం చేసుకున్నారు. హేమలత సింధనూరు తాలూకాలోని పోత్నాళలో ఉద్యోగం చేస్తోంది. దీపావళి పండుగ ముగించుకుని వారు పోత్నాళ్‌ నుంచి తమ సొంత ఊరైన బళ్లారికి కారులో బయలుదేరారు. సింధనూరు–బళ్లారి ప్రధాన రహదారిపై ఉన్న హొసళ్ళి క్యాంప్‌ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి బోల్తా పడింది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో తీవ్ర గాయాల పాలైన రాఘవేంద్ర, హేమలత ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు వెనుక సీట్లో కూర్చున్న రాఘవేంద్ర స్నేహితుడు రవికుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయన్ను వెంటనే సింధనూరులోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింధనూరు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కేసు నమోదైంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

అగ్ని ప్రమాదాల్లో భారీ ఆస్తి నష్టం

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటక పరిధిలోని యాదగిరి, కలబుర్గి జిల్లాల్లో ఆదివారం రాత్రి దీపావళి వేడుకల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో భారీ ఆస్తి నష్టం జరిగింది. వివరాలు ఇలా.. యాదగిరి జిల్లా సూరపుర తాలూకా కెంబావిలో ఒక దుకాణంలో పూజలు ముగించుకుని టపాసులు పేల్చుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ నిప్పురవ్వలు గోదాముకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో గోదాములో భద్రపరిచిన 290 క్వింటాళ్ల పత్తి పూర్తిగా కాలి బూడిదైంది. ఇక కలబురిగి జిల్లా చించోళి తాలూకా సులేపట్‌లోని బసవేశ్వర సర్కిల్‌ (సిద్ధశ్రీ బ్యాంక్‌ ఎదురుగా) వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బాణాసంచా దుకాణంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రూ.20 లక్షల విలువైన బాణాసంచా పూర్తిగా కాలిపోయింది. మంటలు వేగంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న దుకాణాలు, సమీపంలో నిలిపి ఉంచిన ఆటో రిక్షాలు, బైకులు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి.

బోల్తా పడిన కారు

భార్యాభర్తలు మృతి

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో చెలరేగిన మంటలు

దట్టమైన పొగ వ్యాపించడంతో

భయాందోళనకు గురైన స్థానికులు

హొసపేటె: దీపావళి పండుగ రోజున విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లిలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి భారీగా మంటలు ఎగసిపడటంతో పాటు దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పండుగ నేపథ్యంలో విద్యుత్‌ వినియోగం పెరడగంతో ఓవర్‌లోడ్‌ లేదా సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో సమీపంలోని దుకాణదారులు, వ్యాపారులు, ప్రజల తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరిగలేదని సమాచారం. విద్యుత్‌ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఘటన పై విచారణ చేపట్టాలని ప్రజలు కోరారు. ట్రాన్స్‌ఫార్మర్ల సామార్థ్యాన్ని పరిశీలించి పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement