జూద స్థావరాలపై ఆకస్మిక దాడి | - | Sakshi
Sakshi News home page

జూద స్థావరాలపై ఆకస్మిక దాడి

Nov 10 2026 12:07 AM | Updated on Nov 10 2026 12:07 AM

బళ్లారి అర్బన్‌: దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో జూదం నిర్వహిస్తున్న 29 ప్రాంతాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 192 మందిపై కేసులు నమోదు చేసి, రూ.5,71,725 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుమన్‌ డి.పన్నేకర్‌ తెలిపారు. పండుగల పేరుతో జూదం నిర్వహించినా, ఆడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చట్టవిరుద్ద కార్యాకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

రేషన్‌ బియ్యం స్వాధీనం

● ఐదుగురిపై కేసు నమోదు, లారీ సీజ్‌

బళ్లారి అర్బన్‌: అక్రమంగా తరలిస్తున్న 119.4 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా.. నవంబర్‌ 7న బళ్లారి నుంచి కుడుతిని మీదుగా హోస్పేట్‌ వైపు వెళ్తున్న ఎంహెచ్‌–16–సీడీ–5388 నంబర్‌ కలిగిన అశోక్‌ లైలాండ్‌ లారీలో రేషన్‌ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఆహార శాఖ అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన రవిరాజ్‌ గౌతమ్‌, జాదవ్‌, సోలాపూర్‌కు చెందిన సూరజ్‌ ఇంజనీర్‌, లారీ యజమాని అశుతోష్‌ ప్రకాష్‌ దేవరమనె, బళ్లారికి చెందిన అభిలాష్‌, ధనుంజయపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం పథకాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసిన రేషన్‌ బియ్యాన్ని సేకరించి, అధిక ధరకు విక్రయించేందుకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై కుడుతిని పోలీస్‌ స్టేషన్‌లో అత్యవసర వస్తువుల చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థ నియంత్రణ ఉత్తర్వుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న 119.4 క్వింటాళ్ల బియ్యం విలువ సుమారు రూ.2,73,792 ఉండొచ్చని అధికారులు తెలిపారు. దాడిలో డీఎస్పీ బాలనగౌడ, సీఐ ముద్దురంగ స్వామి, ఎస్‌ఐలు వాణి, కుబేర్‌ నాయక్‌ తదితరుల మార్గదర్శకత్వంలో ఆహార శాఖ సిబ్బంది కరిబసప్ప, సయ్యద్‌ ఇమ్రాన్‌, శాంతప్ప, శరణ్‌ బసయ్య శిరస్తేదార్‌ సహకరించారు.

192 మందిపై కేసుల నమోదు

రూ.5.71 లక్షల నగదు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement