ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం...
సాక్షి బళ్లారి: ఉత్తరాఖండ్‌లోని చార్ధాం యాత్రకు వెళ్లిన కర్ణాటక వాసులు తిరుగు ప్రయాణంలో ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. వారి పార్థివదేహాలు స్వగ్రామాలకు చేరుకున్నాయి. మూడు రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌కు తిరిగి వస్తున్న ట్రాన్స్ భారత్ ఏవీయేషన్ సంస్థకు చెందిన హెలికాప్టర్ జోషిమఠ్ సమీపంలోని ఛాయ్గ్రామం వద్ద కొండప్రాంతంలో కుప్పకూలిన నేపథ్యంలో పైలట్‌తో సహా కర్ణాటకకు చెందిన సుధీర్, ప్రముఖ వ్యాపారవేత్త ప్రతాప్, బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసు ఇన్స్పెక్టర్ అరుణ్ సాలుంకె, న్యాయవాదులు శంకర్‌గౌడ, నటరాజ్ మృతి చెందిన విషయం విదితమే. అక్కడ పోస్టుమార్టం తదితరాలు ముగిసిన తర్వాత సోమవారం న్యాయవాది సుధీర్ మృతదేహాన్ని కర్ణాటకలోని స్వగ్రామమైన దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా త్యావణిగి గ్రామానికి తరలించడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
‘పేదలకు అండగా నిలిచేవారు’
కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తిని కోల్పోయామని రోదించారు. పేదలకు అండగా నిలుస్తూ న్యాయవాదిగా ఎన్నో సహాయ సహకారాలు అందించారని గ్రామస్తులు సైతం కన్నీరు పెట్టారు. సంప్రదాయబద్ధంగా ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. అదేవిధంగా హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన బెంగళూరు సీసీబీ ఇన్స్పెక్టర్ అరుణ్ సాలుంకె మృతదేహం కూడా సోమవారం స్వగ్రామమైన బెళగావి జిల్లా అథణి తాలూకా అరటాళ గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. 2007లో కర్ణాటక పోలీసు శాఖలో చేరిన అరుణ్ విధుల్లో చక్కగా రాణించి మంచిపేరు తెచ్చుకున్నారు. ఆయన భౌతిక కాయానికి వారి కుటుంబ సంప్రదాయం ప్రకారం కన్నీటి వీడ్కోలు పలికారు.
దావణగెరె, బెళగావి జిల్లాల్లో విషాదం
స్వస్థలాలకు చేరిన భౌతికకాయాలు


