రాయచూరు రూరల్ : రాయచూరు నగరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో పథ సంచలనం(కవాతు) నిర్వహించారు. ఆదివారం సాయంత్రం వీరాంజనేయ దేవాలయం నుంచి పుర వీధుల గుండా సంచరించి వాల్కట్ మైదానం వరకు చేపట్టారు. మహిళలు రోడ్డు పొడవున గణ వేషధారులపై పూల వర్షం కురిపించారు. వందలాది మంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు కవాతులో పాల్గొన్నారు.
పాత ఓటరు జాబితాతోనే ‘స్థానిక’ ఎన్నికలు
●మంత్రి ఈశ్వర్ ఖండ్రె
హుబ్లీ: త్వరలో జరగనున్న జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో కేంద్రం సర్ ప్రక్రియ తర్వాడ వెల్లడించిన ఓటర్ల జాబితాకు బదులుగా పాత ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించడానికి చట్టంలో అవకాశం ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె తెలిపారు. బీదర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 5న జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ జాబితాకు సంబంధించి ఇప్పటికే తొలి దశ నోటిఫికేషన్ వెల్లడించామన్నారు. అక్టోబర్ 19 వరకు అభ్యంతరాలకు గడువు ఉండిందన్నారు. 2200 అభ్యంతరాలు వచ్చాయని, అధికారులు వాటిని పరిశీలిస్తున్నారన్నారు. మరో వారంలోగా తుది దశ నోటిఫికేషన్ వెల్లడించాలని సూచించానన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత అని, అలాగే రిజర్వేషన్లను ప్రకటించే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. కొన్ని ప్రక్రియల తర్వాత డిసెంబర్ 15 అనంతరం ఎన్నికల తేదీల ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
కోలారు : జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీలకు 63 మంది క్రీడాకారులు ఎంపిక కాగా వారిని డీఈఓ అల్మాస్ ఫర్వీన్ తాజ్ అభినందించి వీడ్కోలు పలికారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా రాణించి జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తేవాలన్నారు. క్రీడలతో శారీరక, మానసిక సమతుల్యం సాధ్యం అన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా విద్యార్థులు ప్రాధాన్యత నివ్వాలన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో నేడు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. దీని నివారణకు విద్యార్థులు పౌష్టికార సేవనంతో పాటు క్రీడల్లో విరివిగా పాల్గొనాలన్నారు. జిల్లా వ్యాయామ విద్యాధికారి మంజునాథ్, తాలూకా వ్యాయామ విద్యాధికారిణి కె లీలా తదితరులు పాల్గొన్నారు.


