ఆకాశంలో వెలుగుల విన్యాసం | - | Sakshi
Sakshi News home page

ఆకాశంలో వెలుగుల విన్యాసం

Oct 18 2026 2:12 AM | Updated on Oct 18 2026 2:12 AM

మైసూరు: చీకటి ఆకాశంలో మిణుకుమిణుకుమనే వేలాది కాంతి బిందువులు, క్షణక్షణం మారుతున్న రంగురంగుల ఆకారాలు, నింగిలో జీవం పోసుకున్న నెమళ్లు, సింహాలు. చాముండేశ్వరి మాత, పరమశివుడు, మరెన్నో ఆకర్షణీయ రూపాల ప్రత్యక్షం. ఇది సాంకేతిక మాయతో చేసిన అద్భుతం.

శనివారం రాత్రి మైసూరు దసరా సంబరాలలో డ్రోన్‌ విన్యాసాలు నేత్రానందం కలిగించాయి. 3,500 డ్రోన్లు సృష్టించిన కాంతి మాయా ప్రపంచం అనిర్వచనీయమైన అనుభూతిని పంచింది. కాగడాల కవాతు మైదానంలో జిల్లా మంత్రి యతీంద్ర డ్రోన్‌ షోని ప్రారంభించారు. దేశం, కర్ణాటక కళా సాంస్కృతిక చరిత్రకు అద్దం పట్టేలా ఆరంభమైంది. రంగురంగుల లైట్లతో వెలుగుతూ డ్రోన్లు ఎగురుతూ రకరకాల ఆకారాల్లోకి మారడం అందరినీ అబ్బురపరిచింది.

3,500 డ్రోన్లతో కనువిందైన రూపాలు

మైసూరు దసరాలో ప్రత్యేకం

రసరంజితం గానకచేరీ

డ్రోన్‌ షోకు ముందు ప్రముఖ గాయకులు ఇందు నాగరాజ్‌, శ్రీహర్ష, వ్యాసరాజ్‌, దివ్య రామచంద్ర , ఐశ్వర్య రంగరాజన్‌ తమ మధురమైన స్వరాలతో అనేక పాటలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఎమ్మెల్యేలు తన్వీర్‌ సేట్‌, రమేష్‌ బండిసిద్దే గౌడ, నటి అనూష రాయ్‌, జిల్లాధికారి లక్ష్మీకాంత రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ సీమా లాట్కర్‌ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్‌ కాంతుల్లో కనువిందు చేసే మైసూరు ప్యాలెస్‌ను వేలాదిగా వీక్షించారు.

12కు పైగా విభిన్న డిజైన్ల కనువిందు

చాముండేశ్వరి అమ్మవారు, అంబారీ ఏనుగు, పరమశివుని నాట్యం, సీఎం డీకే శివకుమార్‌ చిత్రం, మైసూరు నందీశ్వరుడు, పాలపుంత, సీతాకోకచిలుక, నెమలి, అడవిరాజు సింహం తదితర రూపకల్పనలు విశేష ఆకర్షణగా నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement