దొడ్డబళ్లాపురం: లారీ ఢీకొని కేరళ యువతి మరణించిన సంఘటన నెలమంగల తాలూకా వీరనంజిపుర వద్ద జరిగింది. అలినా (24) మృతురాలు. ఈమె స్నేహితుడు అల్బిన్తో కలిసి దేవరాయనదుర్గ కొండ టూర్కు వచ్చింది. తిరిగి బైక్పై వెళ్తుండగా వీరనంజిపుర వద్ద లారీ ఢీకొంది. ప్రమాదంలో అలినా అక్కడే మృతిచెందగా, అల్బిన్ గాయపడ్డాడు. కేరళకు చెందిన వీరు బెంగళూరులో ఓ కాలేజీలో చదువుకుంటూ ఇందిరానగరలో పీజీ హాస్టల్ ఉండేవారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
యశ్వంతపుర రైలు
తాళగుప్పకు పొడిగింపు
శివమొగ్గ: దసరా, దీపావళి పండుగల వేళ కుటుంబాలతో కలిసి సొంత ఊళ్లకు వెళ్లి వచ్చే ప్రజలకు సౌకర్యంగా యశ్వంతపుర–శివమొగ్గ టౌన్ ఎక్స్ప్రెస్ రైలును తాళగుప్ప వరకు పొడిగించాలని నైరుతి రైల్వే నిర్ణయించినట్లు ఎంపీ బి.వై. రాఘవేంద్ర తెలిపారు. ఈ రైలు వారంలో 3 రోజులు నడుస్తుంది. శివమొగ్గ టౌన్ వరకూ వచ్చే రైలును తాళగుప్ప వరకు పొడిగించడం వల్ల సాగర, పరిసర ప్రాంతాల ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. రైలు నం.16581 (యశ్వంతపుర–శివమొగ్గ టౌన్ ఎక్స్ప్రెస్), రైలు నం.16582 (శివమొగ్గ టౌన్–యశ్వంతపుర ఎక్స్ప్రెస్) సర్వీసులకు పొడిగింపు లభించింది.
కారు..అడవిలో.. నడిరేయి
● టెక్కీల ఆర్తనాదాలు
మైసూరు: మైసూరు దసరా ఉత్సవాలను చూసుకుని తమిళనాడులోని చైన్నెకి వెళ్తున్న టెక్కీల కారు, చామరాజనగర జిల్లా హసనూర్ రోడ్డులో గుంతలోకి పడిపోయింది. కారులోని తమిళనాడుకు చెందిన రోజర్ ప్రిన్స్, ప్రిన్స్ మార్టిన్, మణి, అరివుమతి, గుణ, సరమి, భూపేష్, త్రిష, జోసయ్య గాయపడ్డారు. వీరు బెంగళూరులో ఉద్యోగం చేసేవారు. శుక్రవారం రాత్రి మైసూరుకు వచ్చి, ఉత్సవాలను వీక్షించారు. ఆ తర్వాత చైన్నెకి బయల్దేరుతూ ప్రమాదంలో పడ్డారు. సమీపంలో అడవి ఏనుగులు తిరుగుతూ ఉండడంతో కారులోనివారు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేయసాగారు. ఈ ప్రాంతం తమిళనాడులోని సత్యమంగళ టైగర్ రిజర్వ్ పరిధిలోకి వస్తుంది. సమాచారం తెలిసి హసనూర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ బాలమురళి, సిబ్బంది చేరుకుని, ఏనుగులు దూరంగా వెళ్లే వరకు వేచి ఉన్నారు. ఆ తర్వాత అందరినీ రక్షించి పైకి తీసుకువచ్చారు. ట్రాక్టర్ల సహాయంతో కారును రోడ్డు మీదకు తీసుకొచ్చారు. మరో వాహనంలో బాధితులు వెళ్లిపోయారు.
స్టింగ్పై దర్యాప్తు ఏదీ?: విజయేంద్ర
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో సంచలనంగా మారిన స్టింగ్ ఆపరేషన్ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి దోషులకు శిక్ష పడేలా చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండు చేశారు. శనివారంనాడు చిత్రదుర్గలో మీడియాతో మాట్లాడిన ఆయన స్టింగ్ ఆపరేషన్ను సీఎం మంత్రిమండలిలో ప్రస్తావించారని, సీఎం హిట్ అండ్ రన్ చేయకుండా దర్యాప్తు చేయించాలన్నారు. రాష్ట్రంలో స్టింగ్ ఆపరేషన్ల పితామహుడు ఎవరనేది అందరికీ తెలుసన్నారు. ముద్దాయిలు ఎంతటివారైనా శిక్షించాలన్నారు. మైసూరు దసరా ఉత్సవాల్లో ఏర్పాట్లు సరిగా చేయలేదని, పశువులకు మేత, రైతులకు భోజనం, వసతి ఏర్పాట్లు, దూర ప్రాంతాల నుండి వచ్చే టూరిస్టులకు కనీస సౌకర్యాలు కొరవడినట్టు తెలుస్తోందని, ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదన్నారు.
పెద్ద పులి బందీ
మైసూరు: చామరాజనగర జిల్లా, గుండ్లుపేట తాలూకాలోని వడయనపుర, బొమ్మలపుర గ్రామాలలో పశువులపై దాడి చేస్తున్న పులి ఎట్టకేలకు బోనులో పడింది. బొమ్మలపుర శివార్లలో ఓ పొలంలోని బోనులోకి నాలుగైదేళ్ల వయసున్న ఆడ పులి చిక్కింది. బోనులో ఉన్న దూడను పులి తినేసింది. రెండువారాలుగా ఆ పులి ఈ రెండు గ్రామాలలో తిరుగుతూ, పశువులపై దాడి చేసి చంపుతోంది. పులిని పట్టుకోవడానికి అటవీ సిబ్బంది పలుచోట్ల బోనులు పెట్టారు. కాగా దొరికిన పులిని మైసూరు జూ కి పంపాలా, లేక దూరంగా వదిలివేయాలా అనేది ఇంకా నిర్ణయించలేదు.


