తుమకూరు: తుమకూరు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సాగుతున్న దసరా ఉత్సవాలలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలోని మండపంలో ప్రతిష్టించిన చాముండేశ్వరి దేవికి శనివారం కాళరాత్రి అలంకారం గావించి పూజలు, హోమాలను నెరవేర్చారు. డీసీఎం జీ.పరమేశ్వర్, భార్య కన్నిక, ఎస్పీ కేవీ అశోక్, జెడ్పీ సీఈఓ బీవీ అశ్విజ తదితరులు పూజలు చేశారు.
ఎయిర్‌పోర్టులో భిక్షకుల గోల
● ఇద్దరు అరెస్టు
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో మరోసారి హైటెక్ భిక్షాటన వెలుగు చూసింది. పర్స్ పోయిందని ప్రయాణికులను దేబిరిస్తూ క్యూఆర్ కోడ్ చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఢిల్లీవాసి అమీన్ అనే వ్యక్తిని పోలీసులు హెచ్చరించి వదిలిపెట్టడం తెలిసిందే. ఇంతలోనే 2వ టెర్మినల్‌లో ఆర్థిక సాయం చేయాలని ప్రయాణికులను యాచిస్తున్న వెంకట్ దినేశ్ కుమార్, ప్రతీక్ భాటియా అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కూడా వీరు మతపరమైన దుస్తులు వేసుకుని, ప్రయాణికులను డబ్బులు అడుక్కొంటూ ఇబ్బంది పెట్టడంతో పోలీసులు హెచ్చరించి వదిలేశారు. ఈసారి సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఎయిర్‌పోర్టులోకి ప్రయాణికుల మాదిరిగా ప్రవేశించి భిక్షాటన చేయడం కొత్త ట్రెండ్‌గా మారింది. చివరకు ఇది బస్టాండులా మారుతోందనే విమర్శలున్నాయి.
టెన్త్, పీయూసీ పరీక్షల కుదింపు!
బనశంకరి: రాష్ట్ర విద్యాశాఖ ఎస్ఎస్ఎల్సీ, పీయూసీ పరీక్షలను సంస్కరించాలని భావిస్తోంది. ప్రధాన పరీక్షలను 3 నుంచి 2కు తగ్గించాలని యోచిస్తోంది. గత ఏడాది నమోదైన ఉత్తమ ఫలితాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. గత రెండేళ్ల నుంచి 3 పరీక్షల వ్యవస్థ అమల్లో ఉంది. ఇది విద్యార్థులకు అనుకూలంగా మారింది. కొత్త వ్యవస్థకు విద్యార్థులను సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ సూచించింది. అలాగే.. 2027 ద్వితీయ పీయూసీ టైంటేబుల్ ను కూడా ప్రకటించింది. ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభమై మార్చి 17వ తేదీ వరకు జరుగుతాయి.
ఇదేమి కేబినెట్?
● మహిళా కాంగ్రెస్ చీఫ్ సౌమ్యారెడ్డి రాజీనామా
బనశంకరి: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు హైకమాండ్‌కు లేఖ పంపించారు. మంత్రివర్గంలో మహిళలకు చోటు లేదంటూ ఆ లేఖలో అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఆగస్టు 20వ తేదీన రాసిన లేఖ శనివారం వైరల్ కావడం విశేషం. రెండేళ్లు పదవిలో ఉన్నానని, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మహిళల సాధికారతకు కృషి చేశానని చెప్పారు. మంత్రిమండలిలో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడం పార్టీ హైకమాండ్ దృష్టికి తెచ్చానన్నారు. కొత్త అధ్యక్షురాలిని నియమించేవరకు పదవిలో ఉంటానని, రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషిచేస్తానని స్పష్టం చేశారు. సౌమ్యారెడ్డి గత అసెంబ్లీ ఎన్నిలలో జయనగర నుంచి పోటీ చేసి 16 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆమె తండ్రి రామలింగారెడ్డి అటవీ మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో లుకలుకలకు సౌమ్యారెడ్డి రాజీనామా అద్దం పడుతోందనే వ్యాఖ్యలున్నాయి.
కావేరి తీర్థోద్భవం షురూ
యశవంతపుర: కర్ణాటక జీవనాడిగా పేరుగాంచిన పవిత్ర కావేరి నదీ మాత తీర్థోద్భవాలు శనివారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. కొడగు జిల్లా బ్రహ్మగిరి కొండలోని తలకావేరిలో మేష లగ్నంలో సంప్రదాయతీరిలో ఆరంభించారు. ఈ పుణ్యక్షేత్రంలో ఆలయాలను, నది జన్మస్థలిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. కావేరి కుండం వద్ద 9 మంది అర్చకులతో వివిధ పూజలను ఉదయం నుంచి ప్రారంభించారు. సాయంత్రం తలకావేరి బ్రహ్మ కుండ, అగస్తేశ్వర, భాగమండల దేవస్థానం వద్ద విద్యుత్ దీపాలతో అలంకరించారు. తీర్థోద్భవం తరువాత భక్తులకు పవిత్ర జలం పంపిణీ చేశారు.


