బాగేపల్లిలో విజయ సంకల్ప యాత్ర | - | Sakshi
Sakshi News home page

బాగేపల్లిలో విజయ సంకల్ప యాత్ర

Oct 3 2026 1:26 AM | Updated on Oct 3 2026 1:26 AM

బాగేపల్లి: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర నేతృత్వంలో బాగేపల్లిలో విజయ సంకల్ప యాత్ర జరిగింది. కార్యకర్తలతో కలసి సుమారు 3 కి.మీ. మేర విజయేంద్ర కాలినడకన పాదయాత్ర సాగించారు. పట్టణంలోని డాక్టర్‌ హెచ్‌ఎన్‌ సర్కిల్‌లో ఎద్దులబండిలో కూర్చొని సాంకేతికంగా ఈ యాత్రను ప్రారంభించారు. యాత్ర సమయంలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు విజయేంద్రకు ఘనంగా స్వాగతం పలికారు. చిత్రావతి సర్కిల్‌లో బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున తీసుకొచ్చిన యాపిల్‌ పండ్ల మాలను విజయేంద్రకు అలంకరించారు. అనంతరం విజయేంద్ర వాల్మీకి, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సుపరిపాలన అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీయించారని అన్నారు. కరువును ఎదుర్కోవడంలో కూడా పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు.

తుపాకీ మిస్‌ఫైర్‌..

యువకుడి మృతి

యశవంతపుర: రాత్రి వేళ వేటకు వెళ్లిన సమయంలో తుపాకీ మిస్‌ఫైర్‌ అయిన కారణంగా ఓ యువకుడు మృతి చెందిన ఘటన చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకా అటవీ గ్రామం కడేమనెలో జరిగింది. గ్రామానికి చెందిన చేతన్‌కు తూటా తగిలి మృతి చెందారు. బుధవారం రాత్రి 7 మంది అడవిలోకి పందుల వేటకు వెళ్లారు. పందిపై కాల్పులు జరుపుతుండగా మిస్‌ఫైరింగ్‌తో తూటా చేతన్‌కు తగిలింది. తక్షణం అతడి వెంట వేటకు వెళ్లిన యువకులు జయపుర ఆస్పత్రికి తరలించగా మార్గంమధ్యలోనే మృతి చెందారు. కడుపులోకి తూటా దూసుకెళ్లిన కారణంగా రక్తస్రావమై మృతి చెందినట్లు తెలిసింది. ఆస్పత్రికి తరలించిన సమయంలో అక్కడే ఉన్న ముగ్గురిని బాళెహొన్నూరు పోలీసులు అరెస్ట్‌ చేయగా, ఫైరింగ్‌ చేసిన మరో ముగ్గురు తప్పించుకుని పారిపోయారు. కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రి వద్ద కన్నీరుమున్నీరయ్యారు. ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపారో లేక మిస్‌ ఫైరింగ్‌ అయిందో అంతు చిక్కటం లేదని వాపోయారు.

లోయలో పడిన బస్సు..

ప్రయాణికులు సురక్షితం

యశవంతపుర: ఉత్తర కన్నడ జిల్లా కుమటా తాలూకా దేవిమనె ఘాట్‌లోని మాస్తిహళ్ల వద్ద కేఎస్‌ ఆర్టీసీ బస్సు లోయలోకి పడింది. ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గురువారం రాత్రి బాగలకోటె నుంచి శిరసి మీదుగా దేవిమనె ఘాట్‌ మార్గంలో ధర్మస్థలకు వెళ్తుండగా మాస్తిహళ్ల సమీపంలో మలుపు వద్ద అదుపుతప్పి లోయలోకి పడింది. 12 మంది స్వల్పంగా గాయపడగా, డ్రైవర్‌ ప్రమాదం నుంచి బయట పడ్డాడు. స్థానికులు స్పందించి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. బస్సులోని సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కుమటా పోలీసులు కేసు నమోదు చేశారు.

విమానంలో సీపీఆర్‌

దొడ్డబళ్లాపురం: విమాన ప్రయాణికుడికి గుండెపోటు రాగా అదే విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్‌ సీపీఆర్‌ చేసి తగిన వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. ఉత్తర భారత పర్యటనకు వెళ్లిన పుత్తూరుకు చెందిన వారు కొందరు పర్యటన ముగించుకుని ఇండిగో విమానంలో గతనెల 29న తిరిగి వస్తుండగా ఒక ప్రయాణికుడికి గుండెనొప్పి వచ్చింది. అతడితో పాటు భార్య, రెండేళ్ల పాప ఉన్నారు. వారు భయంతో కేకలు వేయగా అదే విమానంలో ఉన్న పుత్తూరుకు చెందిన డాక్టర్‌ శ్రీకుమార్‌ వెంటనే స్పందించి సీపీఆర్‌ చేశారు. విమానం దిగిన వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్‌ శ్రీకుమార్‌ స్పందించిన తీరుకు తోటి ప్రయాకులు చప్పట్లు కొట్టి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement