పులి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

పులి పట్టివేత

Aug 28 2026 2:27 AM | Updated on Aug 28 2026 2:27 AM

మైసూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా బండీపుర పులి అభయారణ్యంలో మద్దూరు కాలనీ జుడుగట్టె చెరువు వద్ద స్పృహలో లేని స్థితిలో పడి ఉన్న 10– 12 ఏళ్ల వయస్సుగల పులిని అటవీ శాఖ సిబ్బంది బంధించారు. ఇది ఆడపులి అని, అనారోగ్యంతో ఉందని తెలిపారు. దానిని వైద్యసేవల కోసం ఏదైనా జూకి తరలించి చికిత్స అందిస్తామని చెప్పారు. శుభం సింగ్‌ తన్వర్‌, సురేష్‌, శైలేంద్ర కుమార్‌, నిసార్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

పొలంలో పులి కళేబరం

మైసూరు: చామరాజనగర జిల్లా, గుండ్లుపేట తాలూకాలోని బొమ్మల్పూర్‌ గ్రామంలోని రైతు విశ్వనాథ్‌కు చెందిన పొద్దుతిరుగుడు పొలంలో పులి చనిపోయి ఉంది. ఇది బండీపుర అడవికి సమీపంలోనే ఉంది. రైతు, కూలీలు చూసి అటవీ శాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఎవరైనా విషాహారం పెట్టి పులిని చంపారా, లేక సహజ మరణమా అనేదానిపై విచారణ చేపట్టారు. పశువైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించి, నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.

ఘనంగా ఒడిబాలు వేడుక

శ్రీనివాసపురం: తాలూకాలోని యల్దూరు గ్రామంలోని వాసవి దేవాలయంలో సతీమాతకు ఒడిబాలు వేడుకను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వినయ గురూజీ స్వామీ మాట్లాడుతూ సీతారామ లక్ష్మణులు వనవాసం ముగించి అయోధ్యకు వచ్చిన సమయంలో సతీమాతకు ఒడిబాలు పోశారని, అందుకు గుర్తుకు ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు.

బస్సులో నెక్లెస్‌ మాయం

మైసూరు: బస్సులో మహిళ వానిటీ బ్యాగ్‌లో బంగారు నెక్లెస్‌ని ఎవరో కాజేశారు. వివరాలు.. మండ్య గోపాల్‌పురవాసులు రష్మి, భర్త మహాదేవతో కలిసి మైసూరులోని హినకల్‌లో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆమె రూ.1.50 లక్షల విలువైన 20 గ్రాముల బంగారు హారాన్ని ఒక పెట్టెలో పెట్టి వానిటీ బ్యాగ్‌లో ఉంచుకుంది. హినకల్‌ వెళ్లే సిటీ బస్సు ఎక్కింది. కొద్ది దూరం తర్వాత బ్యాగ్‌ను తనిఖీ చేయగా, హారం ఉన్న పెట్టె కనిపించలేదు. మైసూరులోని లష్కర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

భక్తిశ్రద్ధలతో ఓంశక్తి వేడుక

చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరం వాబసంద్రంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ఓం శక్తి 12వ సంవత్సరం పూరం గంజి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళా భక్తులు గంజి కుండలను మోసుకొని దేవి నామస్మరణ చేస్తూ ఊరేగింపు చేశారు. స్థలం లభిస్తే అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు.

సీఐడీ బోనులో సాహుకార్‌

బనశంకరి: కేపీఎస్‌సీ నిర్వహించిన పశువైద్యాధికారుల పరీక్షల కుంభకోణంలో సీఐడీ ముందుకు గురువారం ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు శివశంకరప్ప సాహుకార్‌ విచారణకు హాజరయ్యారు. బెంగళూరు ప్యాలెస్‌ రోడ్డులో సీఐడీ ఆఫీసుకు వెళ్లగా కొన్ని గంటలపాటు తీవ్రంగా ప్రశ్నించారు. ప్రశ్నాపత్రం తయారీ, వాల్యుయేషన్‌, నియామక ప్రక్రయ, ఆర్థిక వ్యవహారాల మీద సమాచారం రాబట్టారు. ఈ కేసులో మరికొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు రావచ్చని ప్రచారం సాగుతోంది. మరోవైపు ఐఏఎస్‌ జ్ఞానేంద్రకుమార్‌ ఇప్పటికీ ఆచూకీ లేరు. విచారణకూ హాజరు కాలేదు.

హోటళ్లలో కల్తీ నూనెలు వాడొద్దు: మంత్రి

దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలోని అన్ని రకాల హోటళ్లలో కల్తీ వంటనూనెలు వాడరాదని ఆరోగ్యశాఖ మంత్రి యూటీ ఖాదర్‌ సూచించారు. హోటళ్లలో వాడే వంట నూనె నాణ్యత, లేబుల్స్‌ తదితరాల పరీక్షలకు త్వరలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. హోటళ్లలో నాసిరకం వంటనూనెల వల్ల కస్టమర్లు అనారోగ్యానికి గురవుతున్నట్టు ఫిర్యాదులు అందాయని చెప్పారు. ప్రత్యేక బృందాలు హోటళ్లలో తనిఖీలు చేస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement