దొడ్డబళ్లాపురం: మానస సరోవరకు వెళ్లిన బెంగళూరుకు చెందిన పలువురు కన్నడిగులు గల్లంతైనట్టు తెలిసింది. బెంగళూరుకు చెందినవారు ప్రస్తుతం అమెరికాలో జీవిస్తున్నారు. అక్కడి నుంచి నలుగురు ఎన్‌ఆర్‌ఐలు మానస సరోవర్‌కు యాత్రకని నేపాల్ వచ్చారు. అక్కడి నుంచి వరద ప్రమాదం సంభవించిన ప్రదేశంలో ఉన్న చైనా ఎంబసీ కార్యాలయానికి వెళ్లారు. వరద ముంచెత్తిన తరువాత వారి సమాచారం లభించలేదు. దీంతో స్నేహితులు కర్ణాటక సర్కారుకు సమాచారం ఇచ్చి వారిని రక్షించాలని కోరారు.
● మరోవైపు హైదరాబాద్‌కు చెందిన 23 మంది, కర్ణాటక కలబుర్గి జిల్లా చించోళి తాలూకాకు చెందిన మల్లినాథ్, సంగమేశ్ ఇద్దరు కలిసి మొత్తం 25 మంది నేపాల్‌కు టూర్ వెళ్లారు. సురక్షితంగా ఉన్నట్టు ఫోటో విడుదల చేశారు. పలు జిల్లాల నుంచి కన్నడిగులు నేపాల్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో బెంగళూరువాసులు
బనశంకరి: నేపాల్ వరదల్లో 8 మంది బెంగళూరువాసులు చిక్కుకున్నారని, వారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని డిప్యూటీ సీఎం పరమేశ్వర్ తెలిపారు. బాధితులు, వారి కుటుంబీకులు 1070–08022253707 సహాయవాణికి ఫోన్ చేస్తే సహాయం అందిస్తారని తెలిపారు. సహాయక చర్యల కోసం నేపాల్‌కు ఓ ఉన్నతాధికారిని పంపిస్తామని చెప్పారు.
అండగా ఉంటాం: సీఎం డీకే
బనశంకరి: నేపాల్‌లో చిక్కుకుపోయిన కన్నడిగులకు అండగా ఉంటామని సీఎం డీకే.శివకుమార్ చెప్పారు. ఢిల్లీలో ఉన్న ఆయన పలువురు పర్యాటకులకు కాల్ చేసి ధైర్యం నింపారు. కర్ణాటక నుంచి నేపాల్ విహరయాత్రకు వెళ్లిన వారిలో కొందరి సమాచారం అందడం లేదన్నారు. గాలింపు జరుగుతోందని, ఎవరూ భయపడవద్దని అన్నారు.


