హుబ్లీలో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకోను అడ్డుకుంటున్న పోలీసులు
మైసూరులో నిరసన తెలియజేస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు
మైసూరు: నీట్ ప్రశ్నపత్రం లీక్‌ను కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటోందని ఆరోపిస్తూ, తమ ఎమ్మెల్యేపై చేసిన దాడిని ఖండిస్తూ మైసూరు నగర, గ్రామీణ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో భారీ నిరసన చేపట్టారు. నగరంలోని రామస్వామి సర్కిల్ సమీపంలో వందలాది మంది కార్యకర్తలు గుమికూడి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పలు నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి.ఎస్. శ్రీవత్స మాట్లాడుతూ శ్రీజైలు నుంచి ఖైదీలు పారిపోతే అధికారులు బాధ్యులైతే, నీట్ ప్రశ్నపత్రం లీక్ అయితే మంత్రులను బాధ్యులను చేయాలా? అని ప్రశ్నించారు. మీ ద్వంద్వ వైఖరిని ప్రజలు అర్థం చేసుకుంటున్నార్ఙు అని అన్నారు. చాలా మంది అధికారులను బదిలీ చేశారని ఆయన తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దుష్ప్రచారంలో పాలుపంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. నీట్ పరీక్షలో సమూల మార్పులు తీసుకురావాలని ఆయన సంకల్పించారు. దేశ శ్రేయస్సు, సమగ్రతను సహించకుండా, కొందరు వ్యక్తులు చేస్తున్న రాజకీయ కుట్రలను సహించబోమని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ధీరజ్ మునిరాజ్ వతనాడి తదితరులు పాల్గొన్నారు.
హుబ్లీలో ఆందోళన
హుబ్లీ: ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నప్రతం లీకేజీతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న 21 మంది విద్యార్థులకు ఘనంగా నివాళులర్పించారు. కేఎంసీ ఆస్పత్రి సమీపంలోని గాంధీ విగ్రహం ఎదుట కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు విద్యార్థులు రాస్తారోకో చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ కార్యాలయ ముట్టడికి యత్నం
దొడ్డబళ్లాపురం: కలబుర్గి పట్టణంలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించడానికి బీజేపీ నాయకులు శుక్రవారం యత్నించారు. అయితే పోలీసులు మార్గం మధ్యలోనే వారిని అడ్డుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే డా.అవినాశ్ జాధవ్,మాజీ ఎమ్మెల్యే దత్తాత్రేయ పాటీల్ రేవూర్,జిల్లా బీజేపీ అధ్యక్షుడు అశోక్ బగలి, నాయకులు అమరనాథ్,శరణప్ప తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
మండ్యలో బీజేపీ కార్యకర్తల నిరసన
మండ్య: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పోరాటానికి కాంగ్రెస్ నాయకులు మద్దతు ఇవ్వడాన్ని, బీజేపీ ఎమ్మెల్యేలపై గుడ్లతో దాడి చేయడాన్ని ఖండిస్తూ మండ్య నగరంలో బీజేపీ కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. జయచామరాజేంద్ర ఒడెయర్ సర్కిల్ వద్ద జరిగిన ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఇంద్రేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో డజన్ల కొద్దీ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయన్నారు. ఆ రోజు కాంగ్రెస్ మంత్రి రాజీనామా చేశారా? అని ప్రశ్నించారరు. బొద్దింకల పార్టీ అమెరికాలో పుట్టిన పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, యువతను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ నాయకుడు డాక్టర్ సిద్దరామయ్య పాల్గొన్నారు.
కలబుర్గిలో బీజేపీ నాయకుల అరెస్టు దృశ్యం
మండ్యలో రోడ్డుపై బైఠాయించిన నాయకులు
నీట్ నిరసనలతో
దేశ అస్థిరతకు కుట్ర
మాజీ ఎంపీ ప్రతాప్ సింహ
మైసూరు: నీట్ సంబంధిత నిరసనలు భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు జరుగుతున్న వ్యవస్థీకృత కుట్రలో భాగమని మాజీ ఎంపీ ప్రతాప్ సింహ ఆరోపించారు. శుక్రవారం మైసూరులో ఆయన మాట్లాడుతూ నీట్ పునఃపరీక్ష నిర్వహించి, ఫలితాలు ప్రకటించిన చాలా రోజుల తర్వాత ఈ నిరసనలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో, ఢిల్లీలో కాంగ్రెస్‌తో కలిసి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనలు చేపడుతోందని ఆయన అన్నారు. ఇది ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్ర అని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో సీఏఏ, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల మాదిరిగానే, ఇది మోదీ ప్రభుత్వాన్ని కుదిపేసే ప్రయత్నమని ఆయన అన్నారు. ఇలాంటి ప్రయత్నాలకు అమెరికా ’డీప్ స్టేట్’ నిధులు సమకూరుస్తోందని ఆయన ఆరోపించారు. దేశ ప్రయోజనాలను కాపాడుతున్న మోదీని అధికారం నుంచి తొలగించడానికే ఇలా చేస్తున్నారని అన్నారు.
ప్రశ్నపత్రం లీక్‌ను కాంగ్రెస్ రాజకీయ లబ్ధికి వాడుకుంటోందని బీజేపీ నిరసన
ఎమ్మెల్యేపై కాంగ్రెస్ దాడిని ఖండిస్తూ పలు చోట్ల పార్టీ శ్రేణుల ఆందోళనలు


