మైసూరు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మైసూరు జిల్లా నంజనగూడు శ్రీకంఠేశ్వర స్వామి ఆలయానికి కానుకల రూపంలో రికార్డు స్థాయిలో సుమారు రూ. 2.64 కోట్ల ఆదాయం లభించింది. అయోధ్య శ్రీరామ మందిరంలో హుండీ సొమ్ము గల్లంతైన నేపథ్యంలో ఈసారి లెక్కింపును కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించారు. ప్రభుత్వ కొత్త ఉత్తర్వుల ప్రకారం బయటి వ్యక్తులను ఉపయోగించకుండా ఆలయ సిబ్బంది, బ్యాంకు ఉద్యోగులు, హోంగార్డుల సహాయంతో పోలీసుల భద్రత నడుమ ఈ లెక్కింపును నిర్వహించారు. ఆలయ హుండీలన్నింటిలో ఉంచిన కానుకలను లెక్కించగా, రూ. 2,64,29,610 నగదు, 97.700 గ్రాముల బంగారం, 2.660 కిలోల వెండి, విదేశీ కరెన్సీ, రూ. 2వేల నోట్లు కూడా లభించాయి. ఈ మొత్తం ప్రక్రియకు ఆలయ కార్యనిర్వాహక అధికారి కష్ణ నాయకత్వం వహించారు.
గుండెపోటుతో
సర్ బీఎల్‌ఓ మృతి
దొడ్డబళ్లాపురం: సర్ విధుల్లో పాల్గొన్న పలువురు ఉద్యోగులు గుండెపోటు, ఒత్తిడితో మరణిస్తున్నారు. బీఎల్‌ఓలుగా నియమితులైన ఉద్యోగులు ఒత్తిడి, పైఅధికారుల వేధింపులు తాళలేక పోతున్నారు. తాజాగా బెంగళూరు కొడిగేహళ్లిలో సర్ విధులు నిర్వహిస్తున్న టీచర్ సమంతా కుమారి(44) గుండెపోటుతో మృతి చెందింది. సర్ విధులు చేపట్టాక పైఅధికారులు నిత్యం తీవ్ర ఒత్తిడి తెస్తుండడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనై గుండెపోటుకు గురైందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
తుంగభద్రకు పెరిగిన ఇన్‌ఫ్లో
హొసపేటె: గత రెండు రోజులుగా తుంగభద్ర డ్యాంలోకి ఇన్‌ఫ్లో పెరిగింది. గతకొన్ని రోజులుగా జలాశయంలోకి నీటి ప్రవాహం గణనీయంగా తగ్గింది. కానీ సోమవారం నుంచి రోజురోజుకూ నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. శివమొగ్గ, చిక్కమగళూరు తదితర మల్నాడు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం 1605.47 అడుగులకు, నీటి నిల్వ 30 టీఎంసీలకు చేరుకుంది. డ్యాంలోకి 20,240 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, కాలువల ద్వారా 3,189 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గతేడాది డ్యాంలో నీటి నిల్వ 78.239 టీఎంసీలుగా ఉండేదని మండలి అధికార వర్గాలు తెలిపాయి.
కూలి డబ్బుల కోసం గొడవ
● కార్మికుడిపై తుపాకీతో కాల్పులు
● చిన్నారి తలకు బలమైన గాయాలు
యశవంతపుర: కూలి విషయంపై జరిగిన గొడవలో కార్మికుడిపై యజమాని తుపాకీతో కాల్పులు జరపటంతో చిన్నారి తలకు బలమైన గాయాలైన ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా బాళెహళ్లి గ్రామంలో జరిగింది. తోట యజమాని జగదీశ్‌గౌడ ఇంటి వద్దకు అసోంకు చెందిన కార్మికుడు వెళ్లారు. తన రూ.400 కూలి డబ్బులు ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే జగదీశ్ రూ.350 మాత్రమే ఇస్తానని చెప్పారు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆక్రోశంలో జగదీశ్‌గౌడ ఇంటిలోని తుపాకీని తెచ్చి కార్మికుడిపై కాల్పులు జరపగా అతడి వెంట ఉన్న చిన్నారి తలకు బలమైన గాయాలయ్యాయి. చిన్నారిని తక్షణం మూడిగెరె ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మంగళూరుకు తరలించారు. చిన్నారి పరిస్థితి అందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. మూడిగెరె పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి జగదీశ్‌గౌడపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


