కరెంటు కాటుకు బాలుడి బలి | - | Sakshi
Sakshi News home page

కరెంటు కాటుకు బాలుడి బలి

Jun 5 2026 1:12 AM | Updated on Jun 5 2026 1:12 AM

దొడ్డబళ్లాపురం: తెగి పడిన విద్యుత్‌ తంతిని తొక్కి బాలుడు మృతి చెందిన సంఘటన బీదర్‌ తాలూకా హులసూరు పట్టణంలో చోటుచేసుకుంది. హులసూరు పట్టణంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు విద్యుత్‌ తంతి తెగి నేలమీద పడింది. అలీ మొమిన్‌(8)అనే బాలుడు తన ఇంటి ముందు ఆడుకుంటూ తంతి తొక్కడంతో విద్యుత్‌ షాక్‌ కొట్టి మృతిచెందాడు. హులసూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

శాఖల పంపిణీపై కుతూహలం

శివాజీనగర: డీ.కే.శివకుమార్‌ నేతృత్వపు కొత్త ప్రభుత్వం బుధవారం అఽధికారంలోకి వచ్చింది. సీఎం డీకే శివకుమార్‌తో పాటు 13 మంది ఎమ్మెల్యేలు కేబినెట్‌ హోదా కలిగిన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారంతో ఎవరెవరికి తొలి జాబితాలో స్థానం లభించవచ్చు అనే కుతూహలానికి తెరపడింది. ఇక ఎవరు ఏ శాఖను చేపడతారనే కుతూహలం అధికమైంది. ప్రధాన శాఖలైన ఆర్థిక, జలవనరులు, హోం, ప్రజాపనులు, బెంగళూరు నగరాభివృద్ధి శాఖలు ఎవరికి పంపిణీ అవుతాయనేది ప్రజల్లో కుతూహలానికి కారణమైంది. రెండో జాబితాలో ప్రమాణ స్వీకారం చేసే నూతన మంత్రులకు శాఖల పంపిణీ తరువాత ఈ ప్రక్రియ ఫైనల్‌ కావచ్చు. ప్రస్తుతం ముఖ్యమంత్రి, 13 మంది మంత్రులకు ఏ శాఖలు పంపిణీ కావచ్చు అనే అంచనాలు ప్రచారం అవుతున్నాయి.

సుపరిపాలనకు నాంది

యశవంతపుర: రాష్ట్రంలో సుపరిపాలన అందించటమే తమ ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ జీ.పరమేశ్వర్‌ అన్నారు. గురువారం విధానసౌధలో సీనియర్‌ అధికారులు, ముఖ్యమంత్రితో కలిసి ఆయన మాట్లాడారు. అధికారులందరూ కలిసి ప్రభుత్వానికీ మంచి పేరు తేవాలని మనవి చేశారు. కొత్త ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందాలనేది ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. యువతను అకర్షించే పధకాలను అమలు చేయాలనేది తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. సామాన్య రైతు తహసీల్దార్‌ అఫీసుకు వెళ్లి పని ముగించుకొని సంతోషంగా ఇంటికి వెళ్లాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. జరిగిన అన్యాయంపై పోలీసు స్టేషన్‌కు వెళితే న్యాయం దొరుకుతుందనే భరోసా ఉండాలన్నారు.

బెళగావిలో మరో భారీ

వంచన బట్టబయలు

బనశంకరి: బెళగావిలో శివం అసోసియేట్స్‌ సంస్థ రూ.వందలాది కోట్ల అక్రమాలు మరవక ముందే మరో భారీ వంచన కేసు వెలుగులోకి వచ్చింది. బెళగావి భాగ్యనగరలో ఆదిత్యరాజ క్యాపిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీపై అసిస్టెంట్‌ కమిషనర్‌ నేతృత్వంలో దాడి గురించి సమాచారం అందగానే ఆన్‌లైన్‌ ద్వారా వ్యవహారాలు నిర్వహిస్తున్న కంపెనీ వెబ్‌సైట్‌ నిలిచిపోయింది. దీంతో కంపెనీ యజమాని, అధికారులకు షాక్‌ ఇచ్చారన్న అనుమానం వ్యక్తమైంది. ఆదిత్యరాజ క్యాపిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని మహారాష్ట్రకు చెందిన బలరామ్‌ మానే అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. అధికారులు దాడికి ముందు మెయింటెన్స్‌ నెపంతో సర్వర్‌డౌన్‌ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపవిభాగాధికారి శ్రవణ్‌కుమార్‌ నేతృత్వంలో దాడి చేసిన సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా వందలాది కోట్ల నగదు బదిలీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. రూ.లక్షకు నెలకు రూ.3 వేలు వడ్డీ ఇస్తామని ఆశపెట్టి వేలాది మంది నుంచి నగదు డిపాజిట్‌ చేయించుకుని వంచనకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రికార్డులతో పాటు నగదు మూలాల పరిశీలనకు అధికారులు నడుం బిగించారు.

నైరుతి ఆగమనం

బనశంకరి: నైరుతి రుతుపవనాలు కన్నడనాట ప్రవేశించడంతో కరావళి ప్రదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కర్ణాటకలో వారం రోజుల పాటు నైరుతి వర్షాలు భారీగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కన్నడ జిల్లాలో గురువారం ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించగా మిగిలిన చోట్ల ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. మైసూరు, కోలారు, హాసన, కొడగు, చిక్‌మగళూరు, శివమొగ్గలో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. కరావళి, పశ్చిమ కనుమల ప్రదేశాలైన దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ, బెళగావి, బాగల్‌కోటె, విజయపుర, కలబుర్గి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలుపుతూ ఈ జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ధార్వాడ, గదగ, కొప్పళ, బళ్లారి, విజయనగర, శివమొగ్గ, చిక్‌మగళూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షం కురుస్తుందని తెలిపిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. దావణగెరె జిల్లాలో పూర్తిగా చల్లని వాతావరణంతో కూడుకుంది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రస్తుతం వాతావరణం చల్లగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement