చెరకు తోటలో చిరుత కూనలు | - | Sakshi
Sakshi News home page

చెరకు తోటలో చిరుత కూనలు

Mar 19 2026 8:24 AM | Updated on Mar 19 2026 8:24 AM

మండ్య: మండ్య తాలూకా భూతన హోసూరు గ్రామంలోని చెరకు తోటలో మూడు చిరుత పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. తోటలో నుంచి శబ్దాలు వినిపించడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా మూడు చిరుత పిల్లలు కనిపించాయి. అటవీ అధికారులకు తెలియజేయగా వచ్చి వాటిని స్వాధీనం చేసుకున్నారు. తల్లి చిరుతను బంధించడానికి బోనును ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ధర్మస్థల కేసుపై హైకోర్టులో విచారణ

ధర్మస్థల పరిసరాలలో చోటుచేసుకున్న అత్యాచారాలు, హత్యలు, అసహజ మరణాలపై హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. దర్యాప్తులో లోపాల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి ప్రభుత్వానికి గట్టి ఆదేశాలు జారీచేసింది. పిటిషన్‌దారు కుసుమావతి తరఫు న్యాయవాది ఎస్‌.బాలన్‌ వాదించారు. ఈ కేసు తీవ్రమైనదని, దర్యాప్తు మధ్యలో వదిలిపెట్టరాదనని, 74 కేసుల్లో దర్యాప్తు నివేదిక తక్షణం అందించాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశించింది. మృతదేహం లభించినప్పుడు పోస్ట్‌మార్టం చేశారా, అదృశ్యమైనవారి ఆచూకీ కనిపెట్టారా అని పలు ప్రశ్నలు సంధించింది. సిట్‌ దర్యాప్తు నివేదికను అందించాలని తెలిపింది.

సొంతూళ్లకు పద పద

వరుసగా పండుగలతో బెంగళూరు నుంచి పయనం

యశవంతపుర: ఉగాది, రంజాన్‌ పండుగలు రావడంతో బెంగళూరులోని ఇతర ప్రాంతాల వాసులు వేలాదిగా తమ సొంతూళ్లకు బయలు దేశారు. యథా ప్రకారం బస్సులకు డిమాండు పెరగడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ చార్జీల మోత మోగిస్తున్నాయి. గురువారం ఉగాది పండుగ, శుక్రవారం పార్ణ పండుగ, శనివారం రంజాన్‌, ఆదివారం సెలవు కావడంతో 4 రోజులు సొంతూరిలో బంధుమిత్రులతో సంతోషంగా గడపాలని బయల్దేరారు. ప్రైవేటు బస్సుల చార్జీలు ప్రయాణికులకు భారంగా మారాయి. బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కేఎస్‌ ఆర్టీసీ 2,325 బస్సులను నడుపుతున్నా రద్దీకి చాలడం లేదు. బుధవారం మధ్యాహ్నం నుంచి బెంగళూరు నుంచి అనేక మంది కార్లు, బైకుల్లో స్వస్థలాలకు వెళ్లారు. బెంగళూరు మెజిస్టిక్‌ బస్టాండ్‌ ప్రయాణికులతో కిక్కిరేసి పోయింది. సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు.

షేర్ల పేరుతో మహిళకు రూ.27 లక్షల మస్కా

మైసూరు: మైసూరువాసులను ఆన్‌లైన్‌ నేరగాళ్లు వెంటాడుతున్నారు. షేర్‌ మార్కెట్‌లో అధిక లాభాలు గడించవచ్చని అత్యాశకు పోయిన ఓ మహిళ రూ.27 లక్షలను కోల్పోయిన ఘటన మైసూరులో జరిగింది. మైసూరులోని రాఘవేంద్రనగరకు చెందిన మహిళకు గోబ్రిడ్జ్‌ అనే సంస్థ నుంచి వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. లింక్‌ నొక్కడంతో ఒకరు కాల్‌ చేసి, తమ ద్వారా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అనతికాలంలోనే అధిక లాభాలు గడించవచ్చని ఆశ పెట్టారు. ఆ మాటలను నమ్మిన ఆమె దశల వారీగా దుండగులు చెప్పిన ఖాతాకు రూ.27 లక్షలను జమ చేసింది. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement