శివాజీనగర: బెంగళూరు భవిష్యత్ అవసరాల దృష్ట్యా రెండో అంతర్జాతీయ విమానాశ్రయం, స్కైడెక్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో కేంద్రానికి విన్నవించారు. బుధవారం ఆయన ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. బెంగళూరులో రెండో విమానాశ్రయం కోసం ప్రభుత్వం నెలమంగల, కనకపుర రోడ్డు (సోమనహళ్ళి)తో పాటుగా పలు స్థలాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం కెంపేగౌడ విమానాశ్రయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో 2వ ఎయిర్‌పోర్టు అవసరమని నిశ్చయించింది. బెంగళూరు టూరిజానికి కొత్త కళనిచ్చేలా బహుళ అంతస్తుల భవనం, దానిపై స్కైడెక్ నిర్మాణానికి అనుమతుల కోసం చర్చలు జరిపారు. శీఘ్రమే అనుమతులు ఇవ్వాలని విన్నవించారు. రాష్ట్రంలో ముఖ్యమైన వసతుల ప్రాజెక్టులు, విమానయానం పథకాలపై చర్చించినట్లు డీసీఎం తెలిపారు. పథకాలు సాకారమయ్యేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, సత్వర అనుమతులు అవసరమని అన్నారు. డీసీఎంతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.
ఢిల్లీ టూర్‌లో కేంద్రానికి డీసీఎం వినతి


