● ఇద్దరికి గాయాలు
రాయచూరు రూరల్: ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటక నుంచి శ్రీశైలానికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు శనివారం తెల్లవారుజామున గాయపడ్డారు. వివరాలు.. రాయచూరు తాలుకా ఉండ్రాల దోడ్డికి చెందిన దూల్లయ్య, శంకర్ ద్విచక్ర వాహనంలో శ్రీశైలం బయలుదేరారు. శనివారం తెల్లవారు జామున వెంకటాపూర్ నుంచి నల్లమల ప్రాంతంలో వెళ్తుండగా.. అకస్మాత్తుగా అడవి పంది అడ్డుగా రావడంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అడవి పంది మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన దూల్లయ్య, శంకర్‌ను చికిత్స నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కార్గో టెర్మినల్
ఏర్పాటు చేయాలి
రాయచూరు రూరల్: రాయచూరు రైల్వే స్టేషన్‌లో కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయాలని లోకసభ సభ్యుడు కుమార నాయక్ అధికారులకు సూచించారు. ఆదివారం హుబ్లీ రైల్వే స్టేషన్ అదనపు జనరల్ మేనేజర్ అనంత, ఇతర అధికారులతో చర్చించారు. రాయచూరు గిణిగెర రైల్వే పనులపై ఆరా తీశారు. కుర్డిని రైల్వే క్రాసింగ్ స్టేషన్‌గా గుర్తిస్తే రైతులు పండిస్తున్న పత్తి, మిరప వాణిజ్య పంటలను రవాణా చేసేందుకు వీలు కల్పించినట్లు అవుతుందన్నారు.
యువ కవులకు
మార్గదర్శి రాధాదేవి
రాయచూరు రూరల్: యువ కవులకు మార్గదర్శి హెచ్.జి.రాధాదేవి అని సీనియర్ కవి సిద్ధరామప్ప అన్నారు. ఆదివారం కన్నడ భవనంలో జిల్లా, తాలుకా కన్నడ సాహిత్య, శరణ పరిషత్, కదళి మహిళా సంఘం ఆధ్వర్యంలో వివిధ సాహితీవేత్తలు రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కవితలు సమాజానికి పనికొచ్చేలా యువకుల మనస్సులను దోచేలా రాయాలని సూచించారు. అందరూ పుస్తకాలను చదివేలా ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాది నాగరాజ్, సువర్ణ, విజయ రాజేంద్ర, రాజశ్రీ, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.
నూతన రైలు నడపాలి
రాయచూరు రూరల్: కొప్పళ జిల్లా కుష్టిగి నుంచి బెంగళూరుకు నూతన రైలు నడపాలని రైతు సంఘం అధ్యక్షుడు అందానప్ప కోరారు. ఆదివారం హుబ్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషిని మర్యాదపూర్వకంగా కలసి సమస్యలు విన్నవించారు. వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులతో కలసి మంత్రికి వినతిపత్రం అందజేశారు. కళ్యాణ కర్ణాటక భాగంలోని గదగ్ వాడి కుష్టగి నుంచి హబ్లీకి రైలు ప్రారంభించారని తెలిపారు. కుష్టిగి నుంచి బెంగళూరుకు నూతన రైలును నడపాలని సూచించారు. హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్లేందుకు వీలుగా హళాల్‌పూర్‌లో రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలన్నారు.


