హొసపేటె: మద్యానికి బాసినిసైన ఓ యువకుడు ఆస్తి కోసం సొంత అన్ననే చంపేశాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అన్నను హతమార్చి పరారయ్యాడు. విజయనగర జిల్లా హగరిశిరిహళ్లి గ్రామంలో ఆదివారం ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హగరిశిరహళ్లి గ్రామంలో అన్నతమ్ముళ్లు మరుళసిద్దేశ్, పత్రెగౌడ జీవనం సాగిస్తున్నారు. భూమిలో తనకు వాటా ఇవ్వలేదని తమ్ముడు పత్రిగౌడ రోజూ అమ్మతో గొడవ పడేవాడు. మద్యానికి బానిస కావడంతో డబ్బు కోసం తల్లిని వేధించేవాడు. దీంతో విసిగిపోయిన తల్లి మల్లమ్మ ఆస్తి మొత్తాన్ని పెద్ద కొడుకు అప్పగించింది. దీంతో తన వాటా ఇవ్వాలని పత్రెగౌడ.. అన్న మరుళసిద్దేశ్‌తో గొడవ పడేవాడు. మద్యానికి బానిస అయిన నీకు ఆస్తి ఇచ్చేది లేదని అన్న తేల్చి చెప్పాడు. అన్న ఉన్నంత వరకు తనకు ఆస్తి రాదని పత్రిగౌడ నిర్ణయించుకున్నాడు. తాను బెంగళూరుకు పనికి వెళ్తున్నా అని తల్లితో చెప్పిన పత్రెగౌడ.. ఆదివారం ఆస్తి విషయమై అన్న మరుళసిద్దేశ్‌తో గొడవ పడ్డాడు. బంధువు నారప్పతో కలసి మరుళసిద్దేశ్ ముఖానికి టవల్ చుట్టి కొట్టాడు. అనంతరం తలపై బండరాయితో మోది హతమర్చారు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్న తల్లి మల్లమ్మ అరసికెరె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాలింపు చేపట్టిన పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు వెల్లడించారు.


