శివాజీనగర: వేసవి ఎండలు.. సీఎం కుర్చీ రాజకీయాల మధ్య విందు సమావేశాలు ఊపందుకున్నాయి. డీసీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ డిన్నర్ ఇవ్వబోతున్నారు. బెంగళూరులో ఓ విలాసవంత హోటల్‌లో జరిగే విందుకు సీఎం సిద్దరామయ్యకు ఆహ్వానం ఉందని తెలిసింది. ఈ నెల 6వ తేదీకి శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడై 6 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ సందర్భంగా ఆయన 10వ తేదీన డిన్నర్ ఇవ్వబోతున్నారు. 6న సీఎం సిద్దరామయ్య అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రకటిస్తారు. అందుచేత తన విజయోత్సవాన్ని 10కి మార్చుకున్నారు.
అందరికీ పిలుపు
సిద్దరామయ్య, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తదితర నేతలందరికీ డిన్నర్‌కి ఆహ్వానిస్తారు. భారీఎత్తున భోజన సమావేశం జరుగుతుందని డీకే ఆప్తులు ప్రచారం చేస్తున్నారు. కేపీసీసీ సారథిని, ప్రభుత్వ సారథిని మార్చాలని కాంగ్రెస్‌లోని పలు వర్గాలు పట్టుబడుతున్న తరుణంలో ఈ భేటీకి ఎంతమంది హాజరవుతారు, ఎంతమేర సక్సెస్ అవుతుంది అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే సిద్దు, శివ మధ్య 2 సార్లు విందు భేటీలు జరగడం తెలిసిందే.
కేపీసీసీ చీఫ్ మార్పు లేనట్టేనా?
కేపీసీసీ అధ్యక్షున్ని మార్చాలని ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి ఢిల్లీకి వెళ్లారు. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకే కేపీసీసీ చీఫ్‌గా ఉండాలి, తరువాత వేరొకరికి అప్పగించాలి అని హైకమాండ్ పెద్దలు డీకే కి సూచించారు. అయితే మార్పు జరగలేదు. సీఎం సిద్దరామయ్య వర్గం మంత్రులు కేపీసీసీ అధ్యక్షున్ని మార్చాలని తరచూ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు. కానీ హైకమాండ్ నాయకులు స్పందించడం లేదు. పరిస్థితిని గమనిస్తే శివకుమార్‌ను మార్చే ప్రయత్నం జరగదని తెలుస్తోంది. త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, కర్ణాటకలో బెంగళూరు పాలికెలు, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకూ డీకే కొనసాగే అవకాశముంది. విందు భోజనం ద్వారా బల ప్రదర్శనకు ఆయన సిద్ధమయ్యారు. అతిథులకు కూడా వినూత్న రుచులు, కానుకలకు కొదవ ఉండదు.
గత నెలలో జరిగిన అల్పాహార విందులో సీఎం, డీసీఎంలు
వేసవి ఎండల మధ్య విందు రాజకీయాల విలాసం
10న డీసీఎం డీకే శివ డిన్నర్
సీఎం, మంత్రులు, పార్టీ నేతలందరికీ ఆహ్వానం!
కేపీసీసీ చీఫ్‌గా ఆరేళ్లు కావడంతో
బల ప్రదర్శన
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు..
అశోక్, కుమారస్వామిపై
సీఎం సిద్దరామయ్య ధ్వజం
శివాజీనగర: డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్, ఆయన వర్గంపై నిఘా కోసం సీఎం సిద్దరామయ్య ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్, కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి ఆరోపణలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అశోక్, కుమారలపై సీఎం సిద్దు మంగళవారం మండిపడ్డారు. దొంగే ఇతరులను దొంగ అన్నట్లుగా ఉంది, ఇది అసంతృప్తి ఆత్మల ఆక్రోశం అని ఆరోపించారు. ఈ నిరుద్యోగ ప్రతిపక్ష నాయకులు తాను, శివకుమార్ మధ్య విభేదాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారన్నారు. వారి పులుపు వారితోనే ఉంటుంది, పాలు– తేనెలాంటి తమ సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపదు అని ఓ ప్రకటనలో సీఎం పేర్కొన్నారు. వారు కూడా గతంలో సీఎం, హోంమంత్రులుగా ఉన్నారు, ఆ మాటలను చూస్తోంటే ఇలాంటి పనులకు పాల్పడి ఉంటారు, ఆ అనుభవంతోనే ఆరోపణ చేస్తున్నట్లు ఉందని హేళన చేశారు. తమ ఎమ్మెల్యేలలో ఎవరూ తన, లేక డీకే వర్గం కాదు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అని చెప్పారు. సమావేశాలు కావడం, కలిసి భోంచేసే స్వేచ్ఛ ఉందన్నారు. తాను, శివకుమార్ పార్టీ హైకమాండ్‌కు తలొగ్గుతామని, తమ మధ్య గొడవలు రేపాలనుకుంటే పగటి కలే అని అన్నారు. శివకుమార్ ఒక నిజాయితీ కలిగిన కాంగ్రెస్ నాయకుడు, తప్పుడు కేసులతో జైలుకు పంపి ఆయనను లొంగదీసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని సిద్దరామయ్య దుయ్యబట్టారు.


