సాక్షి,బళ్లారి: జిల్లాలోని కురుగోడులో వెలసిన దొడ్డ బసవేశ్వర ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. శతాబ్దాల చరిత్ర, కోరిన కోర్కెలు తీర్చే బసవణ్ణగా, కోట్లాది మంది భక్తులు ఆరాధించి కొలిచే అపారమైన భక్తి విశ్వాసం, ఆధ్యాత్మిక మహిమలతో భక్తులు కొలుస్తున్న దొడ్డ బసవేశ్వరుడి రథోత్సవం మంగళవారం జరగనుంది. బళ్లారి జిల్లాలోని కంప్లి నియోజకవర్గ పరిధిలో జిల్లా కేంద్రానికి దాదాపు 30 కి.మీ.ల దూరంలో వెలసిన ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంది. శిలలపై శిల్పాలు చెక్కినారు అన్న తెలుగు పాటకు అద్దం పట్టేలా శిల్పులు ఎంతో అద్భుతంగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. మామూలుగా అయితే శివుడి ఆలయంలో ఎదురుగా బసవణ్ణ విగ్రహం ప్రతిష్టించడం ఆనవాయితీ. అయితే ఈ ఆలయంలో సాక్షాత్తు శివుడే నందీశ్వరుడి రూపంలో అవతరించారని ప్రతీతి. అందుకే ఎత్తైన మంటపంలో పెద్ద నందీశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేశారు. ఉద్భవ బసవేశ్వరుడుగా గుర్తింపు పొందిన ఈ దొడ్డ బసవేశ్వరుడిని కోట్లాది మంది భక్తులు కొలిచి తమ కోరికలు తీర్చుకోవడంతో పాటు తమ ఇంటి దైవంగా భావించి కులమతాలకతీతంగా ఈ నందీశ్వరుడిని కొలిచి ఆరాధిస్తుండటం విశేషం.
విశిష్ట ఆలయం.. ప్రత్యేకత సొంతం
కర్ణాటక ప్రాంతంలో భక్తి పరవశాన్ని కలిగించే ప్రముఖ శైవ క్షేత్రాల్లో కురుగోడు దొడ్డ బసవేశ్వర ఆలయం ప్రత్యేకత సంపాదించుకుంది. శతాబ్ధాల చరిత్రను తనలో దాచుకున్న ఈ పవిత్ర పుణ్య క్షేత్రంలో వెలిసిన బసవేశ్వరుడిని కోట్లాది మంది భక్తులు ఆరాధిస్తుండడం విశేషం. గ్రామీణ సంస్కృతి, శైవ సంప్రదాయం, బసవతత్వం, సమ్మిళతంగా కనిపించే అరుదైన క్షేత్రంగా భాసిల్లుతోంది. కురుగోడు పట్టణ నడిబొడ్డున ఈ ఆలయం వెలసింది. కురుగోడు దొడ్డ బసవేశ్వర స్వామి అంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన భక్తులకు ఒక రకమైన ఆనందం, భక్తిని కలిగిస్తోంది. ప్రతి రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ప్రతి సోమ, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేస్తుంటారు. చరిత్రకారుల ప్రకారం కురుగోడు ప్రాంతం ప్రాచీన కాలం నుంచి ధార్మిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఆలయంలో ఉద్భవ బసవేశ్వరుడుగా గుర్తింపు పొందిన నంది విగ్రహం విస్తారంగా ఉండటంతో స్వామిని దొడ్డ బసవేశ్వరుడుగా పిలవడం ప్రారంభించారు.
శిల్ప కళాసంపదకు నిలువెత్తు సాక్ష్యం
విజయనగర రాజుల కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందగా, ఆలయ నిర్మాణానికి నాటి రాజులు సహకారం అందించినట్లు శాసనాలు చెబుతున్నాయి. రాతి నిర్మాణ శైలి, శిల్పుల ప్రతిభ, మండపాల నిర్మాణాలు కళాసంపదకు అద్దం పడుతున్నాయి. దొడ్డ బసవేశ్వరుడి అనుగ్రహంతో ఈ ప్రాంతంలో అనేక మంది కోరిన కోర్కెలు తీర్చుకుని పునీతులు అవుతున్నారు. కరువు కాటకాలు, కష్టాలు ఏర్పడినప్పుడు స్వామిని భక్తిపూర్వకంగా కొలిచే వర్షాలు వచ్చి పంటలు కూడా బాగా పండినట్లు ఎన్నో చరిత్ర ఆధారాలు ఉన్నాయి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రార్థిస్తే ఎందరికో ఉద్యోగాలు ప్రాప్తించినట్లు కూడా చెబుతుండటం విశేషం. ద్రావిడ శైలిలో నిర్మితమైన ఈ ఆలయం శిల్పకళా సంపదకు నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది. ఆలయంలో ప్రతిభాగం కళాత్మకంగా నిర్మించారు. రాతి స్తంభాలపై దేవతా విగ్రహాలు, విశాల గర్భగుడి, పురాతన శాసనాలు, సంప్రదాయం ద్వారా నిర్మాణం తదితర ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా రథోత్సవం, పల్లకీసేవ, అఖండ భజనలు, అన్నదానం, జానపద కళాప్రదర్శనలు నిర్వహిస్తుంటారు.
రథోత్సవానికి గట్టి బందోబస్తు
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ ఆలయం రథోత్సవం అంటేనే ఈ ప్రాంత ప్రజలకు పండుగ వాతావరణం, ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున జరిగే ఈ జాతర, రథోత్సవం అంటే భక్తులకు ఎంతో పండుగ వాతావరణం నెలకొంది. కురుగోడు దొడ్డ బసవేశ్వర స్వామి రథోత్సవం నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుమన పన్నేకర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో జన సందోహం తరలివస్తున్న తరుణంలో ఆలయం చుట్టు ఎలాంటి వాహనాలకు అనుమతి లేకుండా ఆలయానికి దూరంగా ఆయా రహదారుల్లో వాహనాల పార్కింగ్‌తో పాటు ఆలయ ప్రాంగణంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి రథోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆలయంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు వ్యవస్థ, విశ్రాంతి మండపాలు, పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.
కురుగోడులో ఎత్తైన బసవణ్ణ విగ్రహం
కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా గుర్తింపు


