హొసపేటె: నగరంలో పట్టపగలు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఒక వ్యక్తి గొడ్డలితో నరికివేయడం పర్యావరణ వేత్తల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. నగరంలోని పటేల్ నగర్ 6వ క్రాస్‌లోని బీజేపీ కార్యాలయం ముందు ఈ సంఘటన జరిగింది. రోడ్డుకు అడ్డుగా లేని, ఎవరికీ ఇబ్బంది కల్గించని ఈ చెట్టును ఇంటి యజమాని నరికివేశాడు. చెట్టును నరికి వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రజలు, పర్యావరణ వేత్తల్లో ఆగ్రహానికి దారి తీసింది. ఎవరికీ ఇబ్బంది కలిగించని చెట్టును ఎందుకు ఇంత నిర్దాక్షిణ్యంగా, విచక్షణారహితంగా ఎందుకు నరికి వేశారని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్యకు ఎవరు బాధ్యత వహిస్తారు, జిల్లా అటవీ అధికారులా? లేక ఇంటి యజమానా? చెట్టును నరికి వేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? అనే ప్రశ్న తలెత్తింది. చెట్లు, మొక్కలు లేకుండా వన్యప్రాణులు చనిపోతున్న నేటి రోజుల్లో వాటిని కాపాడటానికి బదులుగా ఉన్న చెట్లను నరికి వేయడానికి అనుమతి ఇవ్వడం విచారకరం అని, అటవీ శాఖ అధికారులు అనుమతి ఇస్తూ స్థల తనిఖీ నిర్వహించారా? లేక గుడ్డిగా అనుమతి ఇచ్చారా? అనేది స్పష్టం చేయాలని ప్రజలు, పర్యావరణ వేత్తలు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ విషయంలో కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ప్రజలు, పర్యావరణ వేత్తల్లో
పెల్లుబికిన ఆగ్రహం


