కుక్కల బెడదతో జనం బెంబేలు | - | Sakshi
Sakshi News home page

కుక్కల బెడదతో జనం బెంబేలు

Mar 3 2026 8:22 AM | Updated on Mar 3 2026 8:22 AM

శ్రీనివాసపురం : పట్టణంలోని ప్రధాన వీధుల్లో వీధి కుక్కలు యథేచ్చగా తిరుగుతున్నాయి. వీధి కుక్కల బెడదతో పట్టణ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. పిల్లలు, మహిళలు, సీనియర్‌ సిటిజన్లు, ద్విచక్రవాహనాల్లో వెళ్లేవారు ఎక్కడ కుక్కలు మీదపడి దాడి చేస్తాయోనని భయాందోళన చెందుతున్నారు. తెల్లవారగానే కుక్కల భయం పట్టణ వాసులకు ప్రారంభం అవుతుంది. ఉదయాన్నే వాహ్యాళికి వెళ్లేవారు, పరీక్షలను రాస్తున్న పదో తరగతి విద్యార్థులు తెల్లవారు జామున ట్యూషన్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పలుచోట్ల చిన్న పిల్లలపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఒక్కసారిగా గుంపులుగా వచ్చి దాడులు చేస్తుండడం వల్ల ఒంటరిగా వీధిలోకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డుపై ద్విచక్రవాహనాల్లో వెళ్లే వారిపై కూడా దాడికి దిగడం వల్ల వారు కింద పడి గాయాల పాలవుతున్నారు. తెల్లవారు జామున నరసాపుర పారిశ్రామికవాడ ప్రాంతానికి కంపెనీలకు వెళ్లేవారు కంపెనీ బస్సు కోసం వేచి ఉన్న సమయంలోను వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. వీధి కుక్కలను నియంత్రించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా పురసభ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా వీధి కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement