నవ్విస్తే రూ.13 లక్షలు మీవే..
హుబ్లీ: మీరు విన్నది నిజమే నవ్విస్తే అక్షరాల రూ.13 లక్షలు దక్కించుకోవచ్చు. హోలి పండుగ సందర్భంగా ఈనెల 3వ తేది సాయంత్రం 6:30 నుంచి రాత్రి 12 గంటల వరకు రాణెబెన్నూరులోని రామలింగేశ్వర ఆలయం వద్ద సజీవరతి మన్మథులను కూర్చోబెడుతారు. వీరిని నవ్వించిన వారికి ఏకంగా రూ.13 లక్షల బహుమానం అందజేస్తారు. కార్యక్రమంలో భాగంగా రతి మన్మథులను నవ్వించే ప్రయత్నంలో పోటీదారులు చేసే వివిధ కసరత్తులు ఎంతో ముచ్చట గొలుపుతాయి. గత 27 ఏళ్ల నుంచి నగర నివాసి గదిగప్ప రోడ్డనవర కాముడి వేశాన్ని, అలాగే 32 ఏళ్ల నుంచి కుమార అడపద, రతి వేశాన్ని విజయవంతం నిర్వహిస్తున్నారు. కాగా ఆ ఆరు గంటలు మాత్రం బిగుసుకు పోయి బండరాళ్లలులా నిమ్మకు నీరెత్తిన్నట్లు కూర్చొండి పోయే ఈ అపురూప జంట.. మిగతా సమయంలో మాత్రం ఎంతో హస్య చమత్కారాలతో నవ్విస్తుంటారని స్థానికులు తెలిపారు.
హిందూ ధర్మ సంరక్షణకు ముందుకు రండి
రాయచూరు రూరల్: దేశఽంలో హిందూ ధర్మ సంరక్షణకు ముందుకు రావాలని కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి ముంగ్లీ ప్రాణ దేవాలయ ఆవరణలో హిందు సమ్మేళన విరాట్ ఏర్పాటు చేసిన సభను ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో దేవాలయాలను చర్చీలుగా మారుస్తున్న అంశంపై చర్చించారు. 2047లో భారత దేశాన్ని ఇస్లాం దేశంగా మారుస్తామనే చెబుతున్న నేపథ్యంలో హిందువులు ఏకం కావాలన్నారు. హిందూ దేవాలయాల్లో దానం, ధర్మం, ఉపదేశం, విద్యాదానం తదితర వాటికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. కార్యక్రమంలో విధాన సభ సభ్యుడు శివరాజ్ పాటిల్, బసన గౌడ, నరసప్ప, బండ్షే, రాజ్ కుమార్ పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో రాణించాలి
రాయచూరు రూరల్: మాదిగ కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలని విధాన సభ సభ్యుడు శివరాజ పాటిల్ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని హరిజన వాడ కళ్యాణ మంటపంలో నవరత్న యువ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నూతన పదాధికారులు సమావేశంలో శివరాజ పాటిల్ జ్యోతి వెలిగించి మాట్లాడారు. జనాభాలో అధిక భాగం మాదిగ కులస్తులు ఉన్నా సర్కార్ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. సమాజానికి ప్రత్యేకంగా రిజర్వేషన్ కేటాయింపునకు ఐకమత్యంతో పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో రవీంద్ర, అనిల్ కుమార్, అమరేష్, నరసప్ప, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
కోలారు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించిన ఘటన ఆదివారం ఉదయం తాలూకాలోని కోలారు–గుమ్మరెడి పల్లి గ్రామ మార్గంలో చోటు చేసుకుంది. గుమ్మరెడ్డి పల్లి గ్రామానికి చెందిన నరసింహారెడ్డి ప్రమాదంలో మరణించిన వ్యక్తి. ఉదయం నరసింహారెడ్డి, నివృత్త ఉపాధ్యాయుడు వెంకటరెడ్డి ద్విచక్ర వాహనంలో కోలారు నగరానికి బయలుదేరారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో వెనుక కూర్చున్న నరసింహారెడ్డి ఎగిరి కిందపడ్డాడు. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన క్యాంటర్ వాహనం నరసింహారెడ్డి తలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో నరసింహా రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కోలారు రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన వెంకటరెడ్డిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కుక్కల దాడిలో గొర్రెల మృతి
కోలారు: వీధి కుక్కల దాడిలో 40 గొర్రెలు మరణించిన ఘటన బేతమంగల ఫిర్కా వీరసంద్ర గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కస్తూరమ్మ, కృష్ణప్ప దంపతులు గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్నారు. మేత అనంతరం గొర్రెలను షెడ్డులోకి వదిలారు. శనివారం రాత్రి కుక్కల గుంపు షెడ్డులోకి చొరబడి 40 గొర్రెలను చంపేశాయి. గొర్రెలు చనిపోవడంతో సుమారు రూ.4 లక్షల వరకూ నష్టం వాటిల్లింది. పరిహారం అందించాలని వృద్ధ దంపతులు కోరుతున్నారు.
నవ్విస్తే రూ.13 లక్షలు మీవే..
నవ్విస్తే రూ.13 లక్షలు మీవే..


