మైలార జాతర విజయవంతం చేయండి
హొసపేటె: జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరగనున్న మైలార లింగేశ్వర స్వామి జాతర మహోత్సవంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగుండా అవసరమైన చర్యలు తీసుకొని జాతరను విజయవంతం చేయాలని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి అధికారులను ఆదేశించారు. విజయనగర జిల్లా హడగలి తాలూకాలోని మైలారలో జరిగే మైలారలింగేశ్వర స్వామి జాతర మహోత్సవ సన్నాహాక సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. జాతర సందర్భంగా లక్షలాది మంది ప్రజలు పాల్గొనే దృష్ట్యా నది ఒడ్డున మహిళలు దుస్తులు మార్చుకోవడానికి షామియానా టెంట్లు వేయాలన్నారు. ముందు జాగ్రత్తగా నది ఒడ్డున గజ ఈతగాళ్లను నియమించాలన్నారు. తాత్కాలికంగా మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య శాఖ నుంచి వివిధ ప్రదేశాల్లో వైద్యులు, సిబ్బందితో ఆరోగ్య శిబిరాలను తెరవాలన్నారు. అత్యవసర సేవలకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ బస్టాప్‌లలో తాగునీరు, మరుగుదొడ్లు, అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను అందించాలని ఆదేశించారు.
ట్రాఫిక్ రద్దీ కట్టడికి ఏర్పాట్లు
ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి పోలీసులు శాఖ తగిన ఏర్పాట్లు చేయాలి. జాతర స్థలంలో నిరంతరం పరిశుభ్రతను కాపాడుకోవాలన్నారు. వివిధ ప్రాంతాల్లో చెత్తబుట్టలను ఉంచాలని ఈఓ వారిని ఆదేశించారు. టాయిలెట్లు ఉన్న ప్రదేశాల్లో ప్రజలకు తెలియజేయడానికి సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణనాయక్, జిల్లా ఎస్పీ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.


