యువనిధి ప్లస్ ఉన్నా...
సాక్షి, బెంగళూరు: నిరుద్యోగ ఇంజనీరింగ్ పట్టభద్రుల సంఖ్య కర్ణాటకలో నానాటికీ పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం కన్నడనాట ఉద్యోగాలు లభించని ఇంజనీరింగ్ యువత సంఖ్య 43 వేల మందికి పైగా ఉన్నట్లు తెలిసింది. ఇంకా డిగ్రీ, డిప్లొమా చదువులు పూర్తి చేసినా ఉద్యోగాలు దొరకని వారు ప్రస్తుతం 3.79 లక్షల మందికి పైగా ఉన్నట్లు సమాచారం. వీరంతా రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ స్కీమ్ యువనిధికి నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 43,529 మంది వివిధ ఇంజనీరింగ్ కోర్సులు, 4,250 మంది టెక్నికల్ డిప్లొమా చేసిన వారు కాగా, మిగిలిన వారు ఇతరత్రా సాంకేతిక కోర్సులు చేసిన వారున్నారు. రాష్ట్ర నిరుద్యోగుల్లో 13 శాతం ఇంజనీరింగ్ చదివిన వారే ఉండడం గమనార్హం. అయితే వివిధ కారణాల వల్ల యువనిధికి దరఖాస్తు చేయని నిరుద్యోగుల సంఖ్య ఇంతకు రెట్టింపు ఉన్నా ఆశ్చర్యం లేదని సమాచారం. అవన్నీ చేరితే ఇంజనీరింగ్ నిరుద్యోగులు మరింత ఎక్కువమంది ఉండొచ్చని తెలుస్తోంది.
భృతి మంజూరు
యువనిధికి దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు 2025–26 ఏడాదిలో నిర్ణీత మొత్తం మేర ఆర్థిక సాయం లభించింది. దరఖాస్తు దారుల్లో ఇతర అంశాల్లో పీజీ చేసిన యువతీ యువకులు 27,843 మంది ఉండగా, ఇంజనీరింగ్‌లో పీజీ హోల్డర్లు 374 మంది ఉన్నారు.
నైపుణ్యాలు కరువా?
ప్రతి ఏటా కనిష్టంగా లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల నుంచి పట్టాలతో వస్తున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా కొందరు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. అయితే చాలా మందికి ఆ చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించడం లేదు. నిర్ణీత ఉద్యోనికి అవసరమైన నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మంది యువతీ యువకులు వెనుకబడిపోతున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోఇంజనీరింగ్ కాలేజీల్లో నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయా కంపెనీలు చెబుతున్నాయి.
బెంగళూరులో జాబ్ మేళాలో యువత రద్దీ (ఫైల్)
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇటీవల ధార్వాడలో ధర్నా
కోర్సు చేసినా నిరుద్యోగమే
రాష్ట్రంలో అలాంటివారు 43 వేల మంది
నిరుద్యోగ భృతికి దరఖాస్తు
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మంత్రి శరణ ప్రకాశ పాటిల్ మాట్లాడుతూ ‘రాష్ట్ర యువతకు ఉద్యోగాలు లభించకపోవడానికి కారణం తగిన నైపుణ్యాలు లేకపోవడమే అని తెలిసింది. అందుకోసమే ప్రభుత్వం యువనిధి ప్లస్ అనే కార్యక్రమాన్ని రూపొందించింది’ అని చెప్పారు. ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేలా ఈ పథకం ఉందన్నారు. అయితే ఈ శిక్షణ తరగతులకు 90 శాతం మంది గైర్హాజరవుతున్నారని వాపోయారు. యువనిధికి 3.79 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే శిక్షణకు మాత్రం 27,843 మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో నైపుణ్య శిక్షణ కోసం కేటాయించిన రూ. 27 కోట్లను వినియోగించలేకపోయామని అన్నారు.
యువనిధి ప్లస్ ఉన్నా...
యువనిధి ప్లస్ ఉన్నా...


