అమ్మవారికి కూరగాయల అలంకారం
కోలారు: ధనుర్మాసం సందర్భంగా శనివారం ముళబాగిలు నగరంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు. వేకువజాము నుంచే భక్తులు దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
డ్రైవర్ మత్తు.. కారు చిత్తు
బనశంకరి: మద్యం మత్తులో కారుడ్రైవరు అడ్డదిడ్డంగా నడిపి జనాల మీదకు దూసుకెళ్లాడు. ఈ ఘటన బెంగళూరు ఇందిరానగర 18 మెయిన్ రోడ్డులో చోటుచేసుకుంది. అక్కడే నిలబడిన యువకుడు, యువతులు ఇద్దరు బైకర్లు వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. హోటల్‌లో భోజనం చేసుకుని ఆరుమంది బయట నిలబడ్డారు. ఈ సమయంలో కారువేగంగా దూసుకువచ్చి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డులోని హోటల్‌లోకి దూసుకెళ్లింది. యువకులు, యువతులు వెంటనే పక్కకు తప్పుకున్నారు. ఎదురుగా వస్తున్న ఇద్దరు బైకిస్టులు కూడా తప్పించుకున్నారు. సినిమా స్టైల్‌లో సంభవించిన ప్రమాదం అక్కడ సీసీ కెమెరాలలో నమోదైంది. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తరచూ పుట్టింటికి..
భార్యను చంపి భర్త ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: తనను పట్టించుకోకుండా పదేపదే పుట్టింటికి వెళ్తోందని భార్యను హత్య చేసిన భర్త ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెళగావి జిల్లా బైలహొంగల తాలూకా తురుకర శీగిహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. శివప్ప సన్నబసప్ప (50) అనే వ్యక్తి తన భార్య యల్లవ్వ (46)ను హత్య చేసి తరువాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. యల్లవ్వ పదేపదే తన పుట్టింటికి వెళ్లి వస్తుండడంతో భర్త గొడవపడేవాడు. యల్లవ్వ తల్లి మంగళవారంనాడు చనిపోవడంతో పుట్టింటికి వెళ్లి వచ్చింది, శుక్రవారం మళ్లీ పుట్టింటికి బయలుదేరగా శివప్ప వద్దని అభ్యంతరం తెలిపాడు. దీంతో పోట్లాట మొదలైంది. ఆగ్రహం పట్టలేక కొడవలితో యల్లవ్వ మెడ నరికి హత్య చేసి, తరువాత తాను ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఉపాధి హామీలో అవినీతి.. అందుకే ప్రక్షాళన
● కేంద్రమంత్రి కుమారస్వామి,
బీజేపీ నేతలు
శివాజీనగర: ఇప్పటివరకు ఉన్న ఉపాధి హామీ పథకం స్వరూపాన్ని మార్చి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రాం జీ చట్టాన్ని బీజేపీ, జేడీఎస్ నాయకులు గట్టి సమర్థించారు. ఆ పథకంలో జరుగుతున్న అవినీతి, దుర్వినియోగాలను అరికట్టడం సాధ్యపడుతుందన్నారు. శనివారం బెంగళూరులో ఓ హోటల్‌లో కేంద్రమంత్రి హెచ్.డీ.కుమారస్వామి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. నరేగా పథకంలోని లోపాలను సరిచేసి కొత్తగా వీబీజీ రాం జీ చట్టం తీసుకువచ్చినట్లు చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వ పాలనలో నరేగా చట్టాన్ని అమలులోకి తెచ్చారు, ఇది ఎంతో దుర్వినియోగం అయ్యింది, బోగస్ బిల్లుల ద్వారా భారీగా అవినీతికి పాల్పడ్డారు. వీటిని అరికట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వరూపాన్ని మార్చి రాం జీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. దీని మీద చర్చకు సిద్ధమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సొమ్మును భరించాలనే అభ్యంతరం తీసుకొచ్చింది. కొత్త పథకం ద్వారా కూలీలకు ఏడాదికి 125 రోజులు పని దినాలు, రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా నిధులు లభిస్తాయన్నారు.
అమ్మవారికి కూరగాయల అలంకారం
అమ్మవారికి కూరగాయల అలంకారం
అమ్మవారికి కూరగాయల అలంకారం


