బంగ్లాదేశీయులకు ఇళ్లు ఇస్తే కఠిన చర్యలు
● హోం మంత్రి జి.పరమేశ్వర్
శివాజీనగర: అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు నివసించేందుకు ఇళ్లు ఇచ్చిన యజమానులపై పోలీస్ శాఖ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి జి.పరమేశ్వర్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారత సరిహద్దులో బంగ్లా, ఇతర దేశపు నివాసులు అక్రమంగా చొరబడితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బీఎస్‌ఎఫ్‌తో పాటుగా అన్ని బలగాలను సరిహద్దులో నియమించి చొరబాటుదారులను అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. సరిహద్దులో సొమ్ము ఇచ్చి లోపలికి వచ్చామని కొందరు అక్రమ చొరబాటుదారులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. సొమ్ము ఇచ్చి లోపలికి వస్తున్నారంటే.. సరిహద్దుల్లో సరైన భద్రత లేదని అర్థమవుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ బంగ్లా చొరబాటుదారుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఇప్పటికే కొందరిని స్వాధీనంలోకి తీసుకుని సరిహద్దు దాటించామన్నారు. అక్రమ వలసదారులపై పోలీస్ స్టేషన్లలో రోజూ పరిశీలన జరుగుతోందని తెలిపారు. విదేశీయులు భారత్‌కు వచ్చిన తరువాత అధికారిక వీసా లేకపోతే అటువంటి వారికి నివసించేందుకు బాడుగ ఇల్లు ఇవ్వటం నేరమని పేర్కొన్నారు. ఇంటి యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆకతాయి రైడర్ అరెస్టు
బనశంకరి: డ్రాప్ సమయంలో మహిళను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన ర్యాపిడో బైక్ రైడర్‌ను అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాజీనగర మంజునాథ నగర నివాసి రోహిత్ (37) నిందితుడు. వివరాలు.. 7వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో నాగరబావి నుంచి హెబ్బాళ మాన్యతాటెక్ పార్కులో విధులకు వెళ్లడానికి మహిళ ర్యాపిడో బైక్‌ను బుక్‌చేసింది. మహిళ బైకులో కూర్చుంది, ఆమె బ్యాగును సీటు మీద ఉంచవద్దని రైడర్ కోరాడు. ఏకవచనంతో మాట్లాడుతూ మహిళను తాకాడు. కోపోద్రిక్తురాలైన మహిళ బైకును నిలిపింది, కానీ అతడు అసభ్యంగా ప్రవర్తిస్తూ, డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అతని ప్రవర్తనతో మనస్తాపం చెందిన మహిళ అన్నపూర్ణేశ్వరినగర ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు రైడర్‌ను అరెస్ట్‌చేసి బైక్‌ని సీజ్ చేశారు.
ఈ శిశువు కన్నవారెవరో?
శివమొగ్గ: ఎంతోమంది దంపతులు సంతానం లేక బాధపడుతుంటే, కొందరేమో పుట్టిన శిశువులను రోడ్లపై వదిలేస్తున్నారు. జిల్లాలో కొన్ని నెలల క్రితం రోడ్డు పక్కన లభించిన గుర్తు తెలియని నవజాత మగ శిశువు తల్లిదండ్రుల ఆచూకీ కనుగొనేందుకు సహాయపడాలని శిశు సంక్షేమ సమితి ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై శనివారంనాడు శిశువు చిత్రంతో పత్రికా ప్రకటన విడుదల చేసింది. భద్రావతి తాలూకా మల్లాపుర గ్రామ గేట్ వద్ద రోడ్డు పక్కన శిశువు లభించింది. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హొళెహొన్నూరు స్టేషన్ పోలీసులు శిశువును రక్షించి శిశు సంక్షేమ సమితి సంరక్షణలో ఉంచారు. తల్లిదండ్రులు, బంధువులు ఎవరైనా గానీ శివమొగ్గలోని ఆల్కోళలోని ప్రభుత్వ బాలమందిరంలో సంప్రదించాలని కోరారు.
2028 తరువాతే డీకే
సీఎం: మంత్రి జమీర్
శ్రీనివాసపురం: రాష్ట్రంలో సీఎం సిద్దరామయ్య తరువాత డి కె శివకుమార్‌నే ముఖ్యమంత్రి అవుతారని, అయితే అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత జరుగుతుందని గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ అన్నారు. శనివారం తాలూకాలోని లక్ష్మీపురలో నూరాని మసీదు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నవంబర్ నెల తరువాత రాజకీయ విప్లవం వస్తుందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలలో వాస్తవం లేదన్నారు. తమ పార్టీలో ప్రతీది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 2028 వరకు సిద్దరామయ్యనే సీఎంగా కొనసాగుతారన్నారు. గతంలో కాంగ్రెసేతర ప్రభుత్వాల కంటే బాగా అభివృద్ధి పనులు చేశామని, వాటిని చెప్పుకుని ప్రజల ముందుకు వెళతామని అన్నారు.


