నాగమోహన్‌దాస్ సిఫార్సులు అమలు చేయాలి
హొసపేటె: రాష్ట్రంలో అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మాదిగ, సమాగర, దోహార, దక్కలిగ ఉపకుల సంస్థల కూటమి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్త నిరసన నిర్వహించనున్నట్లు ఆయా ఉపకుల సంస్థల నాయకుడు బ్యాలహుణసి రామన్న తెలిపారు. నగరంలోని ప్రెస్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్ధంగా అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడానికి సువర్ణావకాశం ఉన్నప్పటికీ, సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 101 కులాలకు సామాజికంగా న్యాయమైన అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. 2024 ఆగస్టు 1న సుప్రీం కోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని స్పష్టంగా పేర్కొంది. ఈ విషయంలో హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కేవలం 6 నెలల్లో ఎటువంటి గందరగోళం లేకుండా శాసీ్త్రయంగా అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడంలో విజయం సాధించాయన్నారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన గందరగోళాల కారణంగా 16 నెలల తర్వాత కూడా అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడంలో ఇబ్బంది పడుతోందని ఆయన అన్నారు. సమాజ ప్రముఖులు శేషు, రమేష్, పూజప్ప, శ్రీనివాస్, దుర్గేష్ పాల్గొన్నారు.


