కన్నడకు కువెంపు సేవలు భేష్
రాయచూరు రూరల్ : జాతీయ కవి కువెంపు కన్నడ భాషకు చేసిన సేవలు భేష్ అని జిల్లా వార్త ప్రచార శాఖాధికారి గవిసిద్దప్ప హొసమని వెల్లడించారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో కువెంపు జయంతిని జ్యోతి వెలిగించి మాట్లాడారు. కువెంపు కన్నడ భాషకు చేసిన సేవలను గురించి వివరించి కొనియాడారు. కన్నడ భాషకు జ్ఞానపీఠ అవార్డు రావడానికి ప్రధాన కారకుడన్నారు. కార్యక్రమంలో వెంకట్రావ్ కులకర్ణి, వీర హనుమాన్, సీకే జైన్, మ్యాదర్, రావుత్‌రావ్, ప్రతిభ పాల్గొన్నారు.
కుస్తీ పోటీలు అదుర్స్
హొసపేటె: కొప్పళ గవిసిద్దేశ్వర జాతర సందర్భంగా బుధవారం క్రీడా మైదానంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేశారు. గవిమఠం ప్రాంగణంలో పురుషులు, మహిళల కుస్తీ పోటీలు హోరాహోరీగా జరిగాయి. వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నాగవేణి మాట్లాడుతూ కుస్తీ ఓ పురాతన క్రీడ అన్నారు. ఈ క్రీడ ప్రతి వ్యక్తిలో శారీరక, మానసిక సమతుల్యతను పెంపొందించడంలో సహాయ పడుతుంది. తద్వారా వారిని బలమైన వ్యక్తిగా మార్చడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. పురుషుల విభాగంలోని 16 జట్ల కుస్తీ పోటీదారులు పాల్గొన్నారు.
ఘనంగా ఫలపుష్ప ప్రదర్శన
హొసపేటె: గవిసిద్దేశ్వర జాతర మహోత్సవంలో భాగంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జనవరి 5 నుంచి 14 వరకు గవిమఠం తేరు మైదానంలో 10 రోజుల ఉద్యానవన, ఫల, పుష్ప ప్రదర్శన–2026 నిర్వహిస్తున్నారు. ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ కృష్ణ ఉక్కుంద మాట్లాడుతూ ఈ సంవత్సరం ఉద్యానవన పండ్ల, పుష్పాల ప్రదర్శనలో ఉద్యానవన శాఖ నుంచి అందుబాటులో ఉన్న వివిధ పథకాల గురించి రైతులకు తెలియజేశారన్నారు. ఈ సంవత్సరం రైతుల కోసం విదేశీ కూరగాయలను, పండ్ల ప్రదర్శనను ఏర్పాటు చేశామన్నారు. నేల రహిత వ్యవసాయం(హైడ్రో ఫోనిక్స్ లేదా నీటి వ్యవసాయం)లో కూరగాయల సాగుపై ప్రదర్శన ఇస్తున్నామన్నారు, రైతులు దీనిని సద్వినియోగం
చేసుకోవాలని కోరారు.
విద్యార్థిని చితకబాదిన
గెస్ట్ టీచర్
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకాలో ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని అతిథి ఉపాధ్యాయిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడో తరగతి చదువుతున్న ఖాజాసాబ్‌ను కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న అతిథి ఉపాధ్యాయిని తరగతి గదిలో కట్టేసి వంటిపై వాతలు తేలేలా కొట్టారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి పరిశీలించగా తరగతి గదిలో కట్టేసి కొట్టిన ఖాజాసాబ్‌ను ఇంటికి తీసుకొచ్చి ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. కాగా విద్యార్థిని చితక బాదిన ఉపాధ్యాయినిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
వెనెజువెలాపై దాడి తగదు
రాయచూరు రూరల్ : అగ్రరాజ్యం అమెరికా చిన్న దేశం వెనెజువెలా రాజధానిపై దాడి చేయడం తగదని ఎస్‌యూసీఐ పేర్కొంది. బుధవారం అంబేడ్కర్ ప్రతిమ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు ఎన్‌ఎస్ వీరేష్ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సైనిక బలంతో వెనెజువెలాపై దాడికి దిగి, అధ్యక్షుడు నికోలాస్ మదురో, అతని భార్య సిలియో ఫ్లోరిస్‌ను కిడ్నాప్ చేయించడం సరికాదన్నారు. ఈ ఘటనను యూరప్ దేశాలు ఖండించక పోగా దానికి మద్దతు పలకడం శోచనీయమన్నారు. కిడ్నాప్‌కు గురైన వారి విడుదలకు భారత్‌తో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు ముందుకు రావాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు.
తుపాకీ స్వాధీనం
కెలమంగలం: అంచెట్టి సమీపంలో గెస్తూరు గ్రామంలో హుచ్చేగౌడు తోటలో పోలీసులు సోదాలు జరిపారు. గడ్డి వాము కింద దాచి ఉంచిన నాటు తుపాకీని స్వాధీనపరుచుకొన్నారు. సొంతదారు మునిశివణ్ణ (45)ను అరెస్ట్ చేశారు. అంచెట్టి సీఐ సమిద్‌రావ్, పోలీసులు పాల్గొన్నారు.
కన్నడకు కువెంపు సేవలు భేష్
కన్నడకు కువెంపు సేవలు భేష్


