ధర వెలవెల.. రైతన్న విలవిల
బళ్లారి రూరల్ : ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటుధర లభించకపోతే ఆ రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కరలేదు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. రాష్ట్రప్రభుత్వం క్వింటాల్ మొక్కజొన్న పంటకు రూ.2400 ధర నిర్ణయించగా ఏపీఎంసీ మార్కెట్‌లో మాత్రం రైతుల నుంచి ఈ ధర ప్రకారం పంటను కొనుగోలు చేయడం లేదు. బాగా ఎండబెట్టిన మొక్కజొన్నకు రూ.1800 నుంచి రూ.1900 వరకు మాత్రమే ధర లభిస్తోంది. అంతకంటే నాణ్యత తగ్గితే పంటను రూ.1100లకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కౌలు రైతులకు పంటపై పెట్టుబడి, రసాయనాలు, గింజలు వేరు చేసే మిషన్ ఖర్చులు పోను ఏమాత్రం మిగలడం లేదని రైతులు అంటున్నారు. ఎకరం మొక్కజొన్న పంటకు రూ.35 వేలకు పైగా పెట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ సారి మిర్చి పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ప్రస్తుతం మొదటి రకం క్వింటాల్ మిర్చి పంటకు ధర రూ.14 వేలు లభిస్తోంది. రెండవ రకం రూ.11 వేలు, తెలుపు ఎరుపు కలిగిన మిర్చికి రూ.7 వేలు ధర లభిస్తున్నట్లు కొళగల్లు రైతు గంజి సురేశ్‌రెడ్డి తెలిపారు. గిట్టుబాటు ధర లభించడానికి రైతులు పంట పొలాల్లోని కల్లాల్లోనే మొక్కజొన్న, మిర్చి పంటలను కొన్ని రోజులు ఎండబెడుతున్నారు.
మొక్కజొన్న, మిర్చి రైతులకు
గిట్టుబాటు ధర ఏదీ?
కౌలు రైతులకు పెట్టిన పెట్టుబడి
కూడా దక్కని వైనం
ధర వెలవెల.. రైతన్న విలవిల


