నిఘా నీడలో ఇనాం వీరాపుర
హుబ్లీ: కులాంతర వివాహం చేసుకొని కన్న తండ్రి చేతిలో కర్కశంగా బలైన 7 నెలల గర్భిణి మాన్య నివసించే ఇనాం వీరాపుర గ్రామం సీసీ టీవీ డేగ కళ్ల పహారాలో చిక్కుకుంది. ఇనాం వీరాపుర గ్రామంలో భయంతో కూడిన వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గత నెల 21న మాన్య పాటిల్ హత్యతో ఆందోళనకు గురైన ఈ చిన్న గ్రామ ప్రజలు భయంతో ఇల్లు వదిలి బయటకు రావడం లేదు. ప్రస్తుతం ఆ గ్రామంలో పరిస్థితులు కుదుట పడటంతో ప్రజలు కాసింత ఊరట చెంది భయాన్ని వదిలి బయటకు వస్తున్నారు. ఎప్పటిలాగే రోజు వారీ పనులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు, అంగళ్లు యథావిధిగా ప్రారంభించారు. పోలీస్ బందోబస్తు కొనసాగుతూనే ఉంది. ఘటనపై స్థానికులు పెదవి విప్పడానికి ఇప్పటికీ భయపడుతున్నారు. ఇలాంటి దారుణ హత్య జరిగి ఉండాల్సింది కాదని, అయినా ఏం చేయగలమని అని వారు నిస్సహాయతను వ్యక్తం చేశారు.
ప్రతి వీధిలోనూ సీసీ కెమెరాలు
కాగా ఆ ఊరిలోని ప్రతి వీధిలో కూడా సీసీ టీవీ కెమెరాలు పహారా కాస్తున్నాయి. పరువు హత్యతో తమ గ్రామానికి చెడ్డ పేరు రావడంతో ప్రజలు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. భారీ బందోబస్తు మధ్య సీసీ టీవీల నిఘా కళ్లతో పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితులను విశ్లేషిస్తోంది. స్థానికులు కూడా ఈ విషయమై సామరస్య వాతావరణం ఉండాలని, జరిగిన హత్య వ్యక్తిగత కారణంగా జరిగిందన్నారు. అన్ని కులాల వారికి చెందిన 150 ఇళ్లు ఉన్నాయని, గ్రామంలో సుమారు 600 జనాభా ఉందని స్థానికులు వివరించారు. అందరూ సామరస్యంతో సుహృద్భావంతో జీవిస్తున్నామన్నారు. మొత్తం మీద 17 రోజులుగా ఉన్న భయానక వాతావరణం నుంచి ఇనాం వీరాపుర గ్రామస్తులు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు.


