మృతుడి కుటుంబానికి డీకేశి పరామర్శ
సాక్షి,బళ్లారి: జనవరి 1వ తేదీన నగరంలోని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద చోటు చేసుకున్న రగడలో ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆప్తుడు సతీష్‌రెడ్డి గన్‌మెన్ గురుచరణ్ సింగ్ కాల్పులు చేసిన నేపథ్యంలో మృతి చెందిన రాజశేఖర్ కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పరామర్శించారు. మంగళవారం ఆయన బెంగళూరు నుంచి బళ్లారికి విచ్చేసి, నేరుగా నగరంలోని హుస్సేన్ నగర్‌లో మృతుడు రాజశేఖర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కాల్పుల్లో మృతి చెందిన రాజశేఖర్ తల్లి తులసి, సోదరి ఉమా, సోదరుడు ఈశ్వర్‌లతో ప్రత్యేకంగా మాట్లాడారు. రగడలో మీ కుటుంబ సభ్యుడు మృతి చెందడం తనను ఎంతో బాధిస్తోందన్నారు. అయితే మృతి చెందిన వ్యక్తిని ఎవరూ వెనక్కు తేలేమన్నారు.
ధైర్యంగా ఉండాలని ఓదార్పు
అయితే తమకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులకు ఉద్యోగం, ఇల్లు కట్టించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని మనవి చేశారు. తమకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు మృతి చెందాడని, తన భర్త కూడా మరణించారని మృతుడి తల్లి కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులందరిని ఆయన ఓదార్చారు. మంత్రి జమీర్ అహమ్మద్, ఎమ్మెల్యేలు నారా భరత్‌రెడ్డి, నాగేంద్ర, గణేష్, బుడా అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, కార్పొరేటర్ వివేక్(విక్కీ) పాల్గొన్నారు.
అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా
డీసీఎంకు ఘన స్వాగతం పలికిన నేతలు


