వీడిన చోరీ కేసుల మిస్టరీ
చెళ్లకెరె రూరల్: నగరంలో జరిగిన ప్రత్యేక దొంగతనాల కేసుల మిస్టరీని ఛేదించడంలో చెళ్లకెరె పోలీసులు సఫలీకృతులయ్యారు. ఈ కేసులకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.లక్షలాది విలువ చేసే బంగారు, వెండి, నగదును స్వాధీనపరుచుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 9న నగరంలోని రాణిచెన్నమ్మ రహదారిలో వీ.లక్ష్మి అనే మహిళ నడుచుకుంటూ వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 65 గ్రాముల బంగారు మాంగల్యం చైన్‌ను లాక్కొని పరారయ్యారు. శ్యామసుందర్, దుర్గావర గ్రామానికి చెందిన జేఎస్.మంజునాథ్ అనే వారిని అజ్జనగుడి వద్ద అరెస్ట్ చేసి రూ.7 లక్షల విలువ చేసే 65 గ్రాముల బంగారు చైన్, బైక్‌ను జప్తు చేసుకున్నారు.
మరో ఘటనలో ..
నగరంలోని కుబేర నగరలో జరిగిన మరో ఇంటి దొంగతనంలో బెంగళూరుకు చెందిన నిందితుడు మహ్మద్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.1.74 లక్షల నగదు, రూ.1.18 లక్షల విలువ చేసే 493 గ్రాముల వెండిని స్వాధీనపరుచుకున్నారు. జిల్లా ఎస్పీ రంజిత్‌కుమార్ బండారు, ఏఎస్పీ శివకుమార్, డీఎస్పీ సత్యనారాయణరావ్‌ల మార్గదర్శనంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కే.కుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఈరేష్, కానిస్టేబుల్ శివరాజ్ కార్యాచరణలో పాల్గొన్నారు.
ముగ్గురు దొంగల అరెస్టు
రూ.లక్షలాది సొత్తు స్వాధీనం


