ఇద్దరు దొంగల పట్టివేత
హొసపేటె: కర్ణాటకలో కొప్పళ జిల్లా గంగావతి పోలీసులు రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రూ.13.10 లక్షల విలువైన సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పట్టణంలోని మారెమ్మ గుడి ప్రాంత నివాసి రామాంజనేయ అలియాస్ రామాంజి గురుస్వామి, హొసపేటె తాలూకాలోని మలపనగుడి నివాసి మహేష్ గురుస్వామిగా గుర్తించారు. దొంగతనం కేసులో రూ.12 లక్షల విలువైన 110 గ్రాముల బంగారు, రూ.1.10 లక్షల విలువైన 440 గ్రాముల వెండి ఆభరణాలను సీజ్ చేశారు. గంగావతి డీఎస్పీ న్యామగౌడ మాట్లాడుతూ గంగావతిలోని హొసళ్లి రోడ్డులో రవాణా శాఖ ఉద్యోగి కే.కొట్రేష్ రామప్ప ఇంటిలో జరిగిన చోరీ ఘటనపై జనవరి 17న ఫిర్యాదు నమోదైందని తెలిపారు. అలాగే నీలకంఠేశ్వర క్యాంప్ రవాణా శాఖ డిపో వద్ద అనసూయ మల్లయ్య శెట్టి తన ఇంట్లోనూ చోరీ చేశారని చెప్పారు.
ఎమ్మెల్యేతో పాటు
కుమారుడిపై ఎఫ్‌ఐఆర్
హుబ్లీ: బెళగావి డీసీసీ బ్యాంక్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లింగరాజ్‌పై దాడి చేసిన ఆరోపణలకు సంబంధించి అథణి ఎమ్మెల్యే లక్ష్మణ సవధిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దాడికి గురైన బాధితుడు బెళగావి ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి నుంచే అథణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే సవధి, ఆయన కుమారుడు చిదానందప్పతో పాటు 8 మందిపై కేసులు నమోదు చేసుకున్నారు. కాగా లక్ష్మణ సవధి అభిమానులు తమ నేతపై కుట్ర చేసి కేసు పెట్టారని ఆరోపిస్తూ అథణి పట్టణ బంద్‌ను సోమవారం చేపట్టారు.
భక్తిశ్రద్ధలతో కొప్పళ
గవిసిద్దేశ్వర రథోత్సవం
● లక్షలాదిగా తరలి వచ్చిన భక్త జనం
సాక్షి బళ్లారి: కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఆరాధించి, కొలిచే మఠాల్లో ఒకటైన కొప్పళ గవిసిద్దేశ్వరస్వామి జాతర, రథోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం కొప్పళ పట్టణ నడిబొడ్డున వెలసిన గవిసిద్దేశ్వరస్వామి మఠం ఆవరణలో ఏటా నిర్వహించే రథోత్సవాన్ని ఈఏడాది కూడా కొప్పళ గవిసిద్దేశ్వరస్వామి మఠం పీఠాధిపతితో పాటు మేఘాలయ గవర్నర్ సీహెచ్.విజయ్‌శంకర్, కేంద్ర మంత్రి సోమణ్ణ, రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, స్వామీజీలు పాల్గొని రథోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. దాదాపు 5 లక్షల మందికి పైగా భక్త జనసందోహం పాల్గొనడంతో కొప్పళలో జనజాతర కనిపించింది. గవిసిద్దేశ్వర స్వామి మఠంలో పూజలు, అన్నదానాలతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో వారం రోజుల నుంచి జాతర మహోత్సవాన్ని పండుగలా జరుపుకొన్నారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనడంతో కొప్పళ వీధుల్లో భారీ భద్రతను కల్పించారు.
పోక్సో కేసుల్లో
ఏడుగురు అరెస్ట్
హుబ్లీ: నగరంలో ఒకే రోజు రెండు ప్రత్యేక పోక్సో కేసులు నమోదయ్యాయి. హుబ్లీ టౌన్, అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో చిన్నారులపై మైనర్ బాలలు లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారు. టౌన్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ముగ్గురు మైనర్లు చిన్నారిపై హత్యాచారానికి ఒడిగట్టారు. అశోక్ నగర్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మైనర్ బాలురు ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులతో పాటు దాడి కూడా చేశారు. పైగా ఆ చిన్నారి తండ్రిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తొలి కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, రెండో కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ రెండు ఘటనలపై పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ తమ పిల్లలు తీరిక వేళల్లో ఎవరెవరితో కలుస్తున్నారో, స్నేహం చేస్తున్నారో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా గమనించాలన్నారు. లేకుంటే ఇలాంటి దుష్కృత్యాల బారిన పడి చిన్నారులు తమ భవితను నాశనం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన తల్లిదండ్రులకు హితవు పలికారు.


