క–కలో రైల్వే అభివృద్ధికి రూ.12,900 కోట్లు
హొసపేటె: అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారని, కళ్యాణ కర్ణాటక(క–క)లో రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.12,900 కోట్ల గ్రాంట్‌ను కల్పించిందని కేంద్ర జలశక్తి, రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ తెలిపారు. హగరిబొమ్మనహళ్లిలోని లెవెల్ క్రాసింగ్ 35 వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి సమగ్ర సమాచారం ఇచ్చారు. గతంలో కర్ణాటకకు రైల్వే శాఖ నుంచి ఏటా రూ.882 కోట్లు మాత్రమే అందేవి. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా రూ.7,500 కోట్ల నుంచి రూ.8,000 కోట్లు ఇస్తున్నట్లు ఆయన గణాంకాలతో సహా వివరించారు. బళ్లారి–చిక్కజాజూరు డబుల్ లైన్ నిర్మాణ ప్రాజెక్టుకు రూ.3,400 కోట్లు, బళ్లారి, చిత్రదుర్గ జిల్లాల్లో చేపట్టే మైనింగ్ కార్యకలాపాలతో సరుకు రవాణాకు, మంగళూరు–హైదరాబాద్ మధ్య కనెక్టివిటీకి ముఖ్యమైన బళ్లారి–చిక్కజాజూరు డబుల్ లైన్ ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం 2025 జూన్‌లో ఆమోదించిందన్నారు.
రైల్వే కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పు
సుమారు రూ.3,400 కోట్ల వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలో రైల్వే కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పును తెస్తుందని మంత్రి తెలిపారు. హగరిబొమ్మనహళ్లిలోని ఎల్‌సీ–35కు బదులుగా గుండా రోడ్–కొట్టూరు మధ్య రూ.38.7 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఎల్‌సీ– 37, 38 పనులు కూడా ప్రారంభించామన్నారు. హొసపేటె రైల్వే స్టేషన్‌ను రూ.15.17 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. 80 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. హంపాపట్టణ, హగరిబొమ్మనహళ్లి కనెక్షన్‌కు అవసరమైన 1 ఎకరం 41 గుంటల భూమిని సేకరించడంలో ఆలస్యం చేయవద్దని మంత్రి వేదికపై ఉన్న జిల్లాధికారికి సూచించారు. రైల్వే పనులకు అవసరమైన అనుమతులను త్వరగా అందించాలని ఆయన జిల్లా యంత్రాంగాన్ని కోరారు. బళ్లారి ఎంపీ తుకారాం, హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే నేమిరాజ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే చంద్రనాయక్, డిప్యూటీ కమిషనర్ కవిత ఎస్.మన్నికేరి, జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి, మరియమ్మనహళ్లి మల్లికార్జున స్వామీజీ, డాక్టర్ మహేశ్వర స్వామీజీ, రైల్వే శాఖ సీఈఓ అజయ్ శర్మ, ఏడీఆర్‌ఎం ఎం.విష్ణుభూషన్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి విషయంలో రాజకీయాలు వద్దు
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమణ్ణ


