మళ్లీ మళ్లీ పోస్టుమార్టం చేశారా, లేదా?
సాక్షి,బళ్లారి: మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిని పథకం ప్రకారం హత్య చేసేందుకు కుట్ర పన్ని, రగడ సృష్టించి, కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, అందుకు నారా భరత్‌రెడ్డి ఆప్తుడు సతీష్‌రెడ్డి గన్‌మెన్ గురుచరణ్‌సింగ్ కాల్చడంతోనే మృతి చెందాడని నివేదిక వచ్చినందున వెంటనే ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, సతీష్‌రెడ్డిలను అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన సోమవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. కాల్పుల్లో మృతి చెందిన రాజశేఖర్ మృతదేహానికి మూడు, నాలుగు సార్లు పోస్టుమార్టం చేశారన్నారు. రాజకీయ ఒత్తిడితో మృతదేహంలోని బుల్లెట్‌ను వెలికితీయకుండానే అంత్యక్రియలు పూర్తి చేసేందుకు సిద్ధం అయ్యారన్నారు. అయితే కొందరు పోలీసు అధికారులు నిజాయితీగా పని చేసి పోస్టుమార్టం మరోసారి చేయడంతో 12 ఎంఎం బుల్లెట్ దొరికిందన్నారు. అది సతీష్‌రెడ్డి గన్‌మెన్ తుపాకీది అని తేలిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు, బళ్లారికి న్యాయం జరుగుతుందనే భరోసా లేదన్నారు. అందువల్ల సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐకి కేసు దర్యాప్తును అప్పగిస్తే న్యాయం జరుగుతుందన్నారు. ఈ ఘటనలో గాలి జనార్దనరెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నించి వారు తవ్వుకున్న గోతిలో వారే పడ్డారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయం జరగపోతే తమ పార్టీ పెద్దలు అనుమతి ఇస్తే బళ్లారి నుంచి బెంగళూరుకు పాదయాత్ర చేపట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే టీ.హెచ్ సురేష్‌బాబు, మాజీ మేయర్ వెంకటరమణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కే.ఎస్.దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ మళ్లీ పోస్టుమార్టం చేశారా, లేదా?


