కొప్పళలో హైడ్రామా
సాక్షి,బళ్లారి: రైల్వే వంతెన పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి వీ.సోమణ్ణపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం కొప్పళ జిల్లా హిట్నాళ గ్రామంలో రూ.27 కోట్లతో నూతనంగా రైల్వే వంతెన ఏర్పాటు చేసే పనులకు ఆయన భూమిపూజ చేసేందుకు వచ్చారు. అయితే శంకుస్థాపన శిలాఫలకంలో స్థానిక జిల్లా మంత్రి, లోక్‌సభ సభ్యుడి పేర్లు లేవని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో చేరి, కేంద్రమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలను ఆయనపైకి విసిరేందుకు ప్రయత్నించి, చిందర వందర చేసి, నిరసన వ్యక్తం చేశారు. శంకుస్థాపన ముగిసిన తర్వాత కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, ఆయన వ్యక్తిగత సిబ్బంది భద్రత మధ్య ఆయనను సురక్షితంగా కారులోకి ఎక్కించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాము నిబంధనలకు వ్యతిరేకంగా శంకుస్థాపన చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ రైల్వే వంతెన నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధి వ్యతిరేకించడం బాధాకరమన్నారు. అయితే అభివృద్ధి పనులను ఎవరు అడ్డుకున్నా ఆపేది లేదని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి సోమణ్ణ ఎదుట కాంగ్రెస్ నేతల ఆగ్రహం
రైల్వే వంతెనకు శంకుస్థాపనలో చోటు చేసుకున్న రగడ
కార్యక్రమంలో కుర్చీలను
చిందర వందర చేసిన వైనం


