కేంద్ర కారాగారంలో డీజీపీ తనిఖీ
రాయచూరు రూరల్: కలబుర్గిలోని కేంద్ర కారాగారాన్ని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ అలోక్ కుమార్ తనిఖీ చేశారు. రాష్ట్రంలో జైళ్లలో ఉన్న ఖైదీల విలాసవంతమైన జీవితంపై వీడియోలు వైరల్ కావడంతో తీవ్రమైన నిఘా ఉంచినట్లు తెలిపారు. జైలు అధికారి అనిత, అధికారులు, ఇతర సిబ్బందిపై విచారణకు అదనపు డీజీపీ ఆనందరెడ్డితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కమిటీ విచారణ జరిపి 10 రోజుల్లో నివేదికను అందించాలని సూచించామన్నారు. నాలుగు గంటల పాటు జైలు ఆవరణలో గడిిపిన డీజీపీ మాట్లాడుతూ ఖైదీలకు జైలులోనే జూదం, ఇస్పేట్ వంటివి ఆడటానికి, మద్యం, ధూమపానం చేయడానికి అవకాశం కల్పించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా జైలులో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం వల్లనే ఇలాంటి కుట్రలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయని, దీనిపై కూడా విచారణ చేపట్టినట్లు తెలిపారు.


