జెడ్ ప్లస్ భద్రత కల్పించండి
● ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి
సాక్షి బళ్లారి: ‘తనను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను. ప్రాణహాని ఉండటంతో జెడ్ ప్లస్ భద్రత కల్పించండి’ అని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆదివారం ఆయన ప్రభుత్వాలకు వేర్వేరుగా లేఖలు రాశారు. జనవరి ఒకటవ తేదీన తన ఇంటి వద్దకు ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో చేరి హత్యాయత్నం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘నేను బళ్లారిలో పుట్టి, పెరిగాను. గతంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పని చేశాను. బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా పని చేశాను. అప్పట్లో బీజేపీ అధికారంలోకి రావడానికి శ్రమించాను. తప్పుడు కేసుల వల్ల జైలుకు వెళ్లి వచ్చాను. ప్రస్తుతం నాకు ప్రాణహాని ఉంది. జెడ్ కేటగిరీ భద్రత లేదా అందుకు సరిపడేంత మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించండి’ అని లేఖలో పేర్కొన్నారు. ఇంటి వద్ద కాల్పులు జరిపించిన ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, ఆయన ఆప్తుడు సతీష్‌రెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆ గన్‌మెన్ గురుచరణ్ సింగ్
సాక్షి బళ్లారి: తనను అంతం చేయడానికి కాల్పులు జరిపిన గురుచరణ్ సింగ్ అనే గన్‌మెన్ సతీష్ రెడ్డికే కాదు.. ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా గన్‌మెన్‌గా పని చేస్తున్నట్లు వీడియోలు ఉన్నాయని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగే సమయంలో ప్రభుత్వ గన్‌మెన్లతో పాటు, సతీష్ రెడ్డికి చెందిన గన్‌మెన్లు కూడా తిరుగుతుండేవారన్నారు. నారా భరత్‌రెడ్డి సతీమణికి భద్రతకూడా ఆ గన్‌మెన్లు చూస్తున్నట్లు కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోందన్నారు. కాల్పుల జరిగినప్పడు 3 తూటాలు దొరికాయని చెప్పారు. నారా భరత్‌రెడ్డి, ఆయన ఆప్తుడు సతీష్‌రెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలన్నారు. రాజశేఖర్ మృతదేహంలో లభ్యమైన బుల్లెట్ ఎవరిదో తేలిపోయిందన్నారు.


