అగ్నిమాపక వాహనం ప్రారంభం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలోని పర్యాటక శాఖ కార్యాలయ ఆవరణలో శుక్రవారం కొత్త అగ్నిమాపక యంత్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.టీ.శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాలూకా అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించినప్పుడు అక్కడి అధికారులు తమ అగ్నిమాపక కేంద్రానికి కొత్త వాహనం అవసరమని, దానిని అందించాలని కోరడంతో ఆ మేరకు అగ్నిమాపక యంత్రాన్ని అందించామన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు ఈ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కానాహొసహళ్లి ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో కొత్త ప్రాంతీయ అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అత్యున్నత స్థాయిలో ఇప్పటికే ఆమోదం లభించిందన్నారు. ప్రాంతీయ అగ్నిమాపక అధికారి కే.తిమ్మారెడ్డి, బళ్లారి జిల్లా అగ్నిమాపక అధికారి వలి ఎస్.ప్రమోద్, తహసీల్దార్ కే.నేత్రావతి, అగ్నిమాపక కేంద్రం ఇన్‌చార్జి అధికారి సీపీ కెంగప్ప, డీఎస్పీ మల్లేష్ దొడ్డమని తదితరులు పాల్గొన్నారు.


