పరువు హత్యల నివారణకు చర్యలు
హుబ్లీ: పరువు హత్యల నివారణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్ప స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని తెలిపారు. గురువారం ఇనాం వీరాపుర గ్రామంలో మాన్య పాటిల్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. రూ.16 లక్షల చెక్కును బాధితులకు అందజేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఇది పౌర సమాజానికి, మానవత్వానికి తీరని కలంకం అన్నారు. మాన్య అనే యువతి కులాంతర ప్రేమ వివాహం చేసుకుందన్న అక్కసుతో దారుణంగా హత్య చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ కేసులో నిందితులను వారిని ప్రోత్సహించిన వారిపై జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుందన్నారు. ఇలాంటి పని చేసే వారు, వారికి మద్దతు ఇచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధలా అండగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి సూచించడం జరిగిందన్నారు. ఆ కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం, హోం మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీసీ దివ్యప్రభు తదితరులు పాల్గొన్నారు.


