‘రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దు’
రాయచూరు రూరల్: కోప్పళ్‌లో రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దు అని స్థానికులు డిమాండ్ చేశారు. గురువారం కోప్పళ్ నగర సభ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. రసాయన పరిశ్రమల ఏర్పాటుతో ప్రజలు, మూగజీవాలకు ముప్పు వాటిల్లుతుందని కోప్పళ ఎంపీ రాఘవేంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ ప్రాంతంలో విష పదార్థాలను వెదజల్లే పరిశ్రమలు స్థాపించి మానవుల జీవితాలను అనారోగ్యం పాలు చేయడం తగదని ఆదోళనకారులు వివరించారు. బల్దోట, కిర్లోస్కర్, కళ్యాణ స్టీల్, ముక్కుంది సుమి, ఏక్సో ఇండియా కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పితే తుంగభద్ర జలాలు కలుషితం అవుతాయని పేర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి చేసి పరిశ్రమలు ఏర్పాటు కాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో అల్లమ ప్రభు బెటదూరు, మంజునాథ్, మదరి, హన్మంతప్ప, మల్లికార్జున, గురునాథ్ గౌడ, విరుపణ్ణ, వీరభద్రప్ప, పుష్పలత, నాగరాజ్ భరమన్న పాల్గొన్నారు.


