లంచం డిమాండ్ చేసిన సంక్షేమ శాఖాధికారిణి అరెస్ట్
హోసూరు: ఓ మహిళ నుంచి లంచం డిమాండ్ చేసిన సంక్షేమ శాఖాధికారిణిని లంచ నిరోధక శాఖ (అవినీతి నిరోదక శాఖ) పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. క్రిష్ణగిరి జిల్లా నాగరసంబట్టి సమీపంలోని కనవాయ్‌పట్టి గ్రామానికి చెందిన వనజకు 15 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. కొద్ది సంవత్సరాలకే కోర్టులో విడాకులు తీసుకుంది. పెళ్లి సమయంలో కట్నంగా అందజేసిన నగదు, నగలను తన భర్త నుంచి ఇప్పించాలని కోర్టులో కేసు దాఖలు చేసింది. అదే విధంగా రెండు నెలల క్రితం జిల్లా కేంద్రం క్రిష్ణగిరి కలెక్టరేట్‌లోని సామాజిక సంక్షేమ శాఖాధికారిణి మార్తకు వినతిపత్రం అందజేసింది. కట్నంగా అందజేసిన నగలు, నగదును రికవరీ చేసి ఇచ్చేందుకు రూ.3 వేలు లంచం ఇవ్వాలని సామాజిక సంక్షేమ శాఖాధికారిణి మార్త డిమాండ్ చేసింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని వనజ ఈ విషయాన్ని లంచ నిరోదక శాఖ పోలీసుల దృష్టి తీసుకెళ్లింది. పథకం ప్రకారం లంచ నిరోధక శాఖ అధికారులు అందజేసిన రసాయం కలిపిన నోట్లను మార్తకు అందజేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సామాజిక సంక్షేమ శాఖాధికారిణి మార్తను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


