రౌడీషీటర్ల అరెస్ట్
రాయచూరు రూరల్: విజయపురలో ఇద్దరు రౌడీషీటర్లను అరెస్ట్ చేసి కలబుర్గి జైలుకు పంపడం జరిగిందని ఎస్పీ లక్ష్మణ నింబరిగి వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుండా చట్టం కింద ఫరహన్‌అహ్మద్, సిద్దప్ప మూడలిగిని అరెస్ట్ చేశామన్నారు. ఫరహన్ అహ్మద్‌పై 9 కేసులు, సిద్దప్ప మూడలిగిపై 12 కేసులు ఉండటంతో గుండా చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించామన్నారు.
నియామకం
రాయచూరు రూరల్: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యదర్శిగా రాయచూరు జిల్లాకు చెందిన శ్రీదేవిని నియమిస్తూ ఆ పార్టీ కార్యదర్శి వేణు గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. దేవదుర్గ తాలూకా 2023 విధాన సభ ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీదేవి ఓడిపోయారు. పార్టీ సభ్యత్వ నమోదులో ముందు ఉండటంతో ఆమెను కార్యదర్శిగా నియించారు. కాగా.. శ్రీదేవి మాజీ ఎంపీ వెంకటేష్ నాయక్ కోడలు కావడం విశేషం.
బోరు బావులు
తవ్వించేందుకు చర్యలు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో 6,622 మంది ఎస్సీ, ఎస్టీ రైతుల పొలాల్లో బోరు బావులు తవ్వించేందుకు చర్యలు చేపట్టినట్లు చిన్ననీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం బెంగళూరు విధాన సౌధలో అధికారులతో చర్చించారు. 2025–26లో వారికి సౌలభ్యాలను ఒనగూర్చాలన్నారు. పట్టణాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు మహర్దశ కల్పించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. రూ.365 కోట్లతో 3,388 ఎస్సీ కుటుంబాలు, 1,983 ఎస్టీ కుటుంబాలకు ఆర్థికసాయం చేయాలన్నారు. చెక్ డ్యాం నిర్మాణాలు, సాముహిక ఎత్తిపోతల పథకాలపై చర్చించాలని సూచించారు.
కాషాయమయమైన బళ్లారి
● రేపు మహార్షి వాల్మీకి విగ్రహావిష్కరణ
సాక్షి బళ్లారి: నగరంలోని ఎస్‌పీ సర్కిల్ వద్ద ఈనెల 3వ తేదీ (శనివారం) వాల్మీకి మహార్షి విగ్రహావిష్కరణ జరగనుంది. నాలుగు రోజుల క్రితం మహిళలు పూర్ణ కుంభాలతో ఉరేగింపుగా వచ్చి మహార్షి వాల్మీకి విగ్రహాన్ని ఎస్‌పీ సర్కిల్‌కు చేర్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఎస్‌పీ సర్కిల్ వద్ద భారీగా ఫ్లెక్సీలు, కాషాయ జెండాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు, నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాల్మీకి విగ్రహావిష్కరణ చేస్తున్న నేపథ్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో ఎస్‌పీ సర్కిల్ వద్ద గతంలో బీజేపీ నేతల ఆధ్వర్యంలో వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు మరో విగ్రహాన్ని పక్కనే ఏర్పాటు చేస్తుండటంతో సర్వత్రా చర్చానీయాంశంగా మారింది.
పథకాలతో మహిళా వికాసం
కోలారు: ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది, వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని విధానపరిషత్ మాజీ ఉప సభాపతి వి ఆర్ సుదర్శన్ తెలిపారు. గురువారం తాలూకాలోని వేమగల్ శ్రీ ద్రౌపతాంభ ధర్మరాయస్వామి సముదాయ భవనంలో శ్రీ క్షేత్ర ధర్మస్థల గ్రామీణాభివృద్ధి పథకం బిసి ట్రస్టు మహిళా జ్ఙాన వికాస కార్యక్రమంలో మాట్లాడారు. నేడు ప్రభుత్వం శక్తిపథకం, గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్నభాగ్య, యువనిధి వంటి వినూత్న పథకాలను తీసుకు వచ్చిందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. కార్యక్రమంలో శ్రీ క్షేత్ర ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లా డైరెక్టర్ శివానంద ఆచార్య, జ్ఙాన వికాస సమన్వయ అధికారి శిల్ప తదితరులు పాల్గొన్నారు.
రౌడీషీటర్ల అరెస్ట్
రౌడీషీటర్ల అరెస్ట్
రౌడీషీటర్ల అరెస్ట్
రౌడీషీటర్ల అరెస్ట్


