పాదయాత్రకు సహకరించాలి
రాయచూరు రూరల్: కర్ణాటకలో తుంగభద్ర నదిని కాలుష్య రహితంగా ఉంచడానికి, దాని పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్మల తుంగ అభియానకు శ్రీకారం చుట్టారు. గురువారం మాన్వి తాలుకా పోత్నాళ్‌లో జరిగిన సభలో ఉటకనూర్ మరి బసవలింగ స్వామి, తోటంద్ర స్వామి మాట్లాడారు. నిర్మల తుంగభద్ర అభియాన, జాల జాగృతి పాదయాత్రకు అందరూ సహకరించాలని కోరారు. డిసెంబర్ 27న గంగావతి తాలూకా కిష్కింద నుంచి ప్రారంభమైన యాత్ర 2026 జనవరి 4వ తేదీన మంత్రాలయం చేరుకుంటుందని పేర్కొన్నారు. తుంగభద్ర నది నీటిని వినియోగించుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో నిర్మల తుంగ అభియాన సంచాలకులు మహిమ పాటిల్, బసవ రాజ్ పాటిల్, మాజీ ఎంపీ బి.వి.నాయక్, మాజీ శాసన సభ్యులు రాజా వెంకటప్ప నాయక్, బసన గౌడ, గంగాధర నాయక్, హనుమాన గౌడ, ఉదయ కుమార్, శ్రీధర్ స్వామి, అనిత పాల్గొన్నారు.
కోరేగావ్
ఆశయ సాధనకు కృషి
రాయచూరు రూరల్: కోరేగావ్‌లో బ్రిటిష్ కంపెనీని ఎదురించి పోరాటి చేసిన వీరుడు భీమా కోరేగావ్ అని పలువురు కొనియాడారు. గురువారం నగరంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కోరేగావ్ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. విశ్వనాథ్ పట్టి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. భీమా కోరేగావ్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రజలను రక్షించిన కోరేగావ్ స్మరణార్థం పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించి ప్రార్థనలు జరిపారు.
హంపీలో
ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకులు
హొసపేటె: హంపీ సమీపంలోని ఆనెగొందిలో అంతర్జాతీయ ప్రచారకుల సమావేశం నిర్వహించారు. దత్తాత్రేయ హోసబాలే నేతృత్వంలో 23 దేశాల నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం విదేశీ ప్రచారకులు యునెస్కో వారసత్వ ప్రదేశమైన హంపీలోని విఠల ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంధ సేవకులు హంపీలోని కట్టడాలను ఆసక్తిగా తిలకించారు. మూడు రోజుల మేధోమథన కార్యక్రమంలో భాగంగా హంపీలోని పురాతన ప్రదేశాలను సందర్శించినట్లు వారు తెలిపారు.
హంపీలో
అక్క క్యాంటీన్ ప్రారంభం
హొసపేటె: రాష్ట్రంలో తొలిసారిగా హంపీలోని ప్రపంచ ప్రఖ్యాత విజయ విఠల్ ఆలయం ముందు మొబైల్ సిస్టర్ క్యాంటీన్‌ను జిల్లా పంచాయతీ డిప్యూటీ సెక్రటరీ కె.తిమ్మప్ప బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ప్రజలు, పర్యాటకులకు భోజనం దొరకడం కష్టమని తెలిపారు. జగజ్యోతి గ్రామ పంచాయతీ స్థాయి సంఘం– హంపీ ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవి మహిళా స్వయం సహాయక బృందం మహిళలు వంటలను తయారు చేసి క్యాంటీన్ ద్వారా విక్రయిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు ఉమేష్, ఆలంబాషా, నాగరాజ్, ప్రసన్న, కళావతి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
అడవి పిల్లిని
రక్షించిన అధికారులు
మైసూరు: చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట తాలూకా బరగి గ్రామంలోకి అడవి పిల్లి చొరబడింది. దానిని చూసిన గ్రామస్తులు చిరుత పిల్లగా భావించారు. తల్లి చిరుత ఇక్కడకు సమీపంలోనే ఉంటుందని భయాందోళనకు గురయ్యారు. అయితే అది అడవి పిల్లి అని గుర్తించి అటవీ శాఖకు సమాచారం అందించారు. స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది అడవి పిల్లిని పట్టుకొని సురక్షితంగా అడవిలో వదిలారు.
పాదయాత్రకు సహకరించాలి
పాదయాత్రకు సహకరించాలి
పాదయాత్రకు సహకరించాలి


